Janhvi Kapoor: కావాలనే ఆ సమయంలో అమ్మను దూరం పెట్టాను: జాన్వీ కపూర్‌

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన తల్లిని గుర్తుచేసుకున్నారు. తన మొదటి సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీదేవిని దూరం పెట్టినట్లు చెప్పారు.

Published : 15 Dec 2023 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి (Sridevi) కుమార్తెగా వెండితెరకు పరిచయమై.. మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి కుమార్తె అయిన కారణంగా అభద్రతా భావానికి గురైనట్లు చెప్పారు. తన తొలి సినిమా ‘ధడక్‌’ షూటింగ్‌కు శ్రీదేవిని రావొద్దని కూడా చెప్పినట్లు తెలిపారు.

‘‘నేను శ్రీదేవి కుమార్తె కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను దూరం పెట్టాను. ఆమె నుంచి ఎలాంటి సాయం తీసుకోకూడదనుకున్నా. ఆమెలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించా. నా తొలి సినిమా సెట్స్‌కు కూడా ఆమెను రావొద్దని, నాకు సాయం చేయద్దని చెప్పాను. ఆమె కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమవ్వడంతో ఎందుకో అభద్రతా భావానికి లోనయ్యేదాన్ని. ఆమె సలహాలు కూడా తీసుకునేదాన్ని కాదు. నేనంత హాస్యాస్పదంగా ఆలోచించానో ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రతి విషయం ఆమెకు చెప్పాలనిపిస్తుంది. ‘అమ్మా.. షూట్‌ ఉంది. త్వరగా రా’ అని ఆమెతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఆమె కూతురినైనందుకు ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ అని అభిమానులు అంటుంటే ఆనందంగా ఉంది’అని చెబుతూ జాన్వీ  భావోద్వేగానికి గురయ్యారు.

రీమేక్స్‌తో డీలా.. షారుక్‌ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్‌ తీరిలా!

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు ‘దేవర’తో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు జాన్వీ. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో తంగమ్‌ అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ పేరుతో ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు