Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్‌ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్‌ తీరిలా!

ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్‌ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్‌? ఏది ఫట్‌? చూసేయండి..

Updated : 26 Dec 2023 20:15 IST

ఎన్ని చిత్ర పరిశ్రమలున్నా ‘ఇండియన్ సినిమా’ అంటే ఒకప్పుడు కేవలం బాలీవుడ్‌ (Bollywood) మాత్రమే అందరికీ గుర్తొచ్చేది! అక్కడి వారు తీసిందే సినిమా.. ఆ పరిశ్రమలో నటించిన వారికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. కానీ, కొన్నాళ్లుగా ఆ పరిస్థితి మారుతూ వస్తోంది. మూస సినిమాలతో అక్కడి ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. దీంతో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించే హిందీ సినిమాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. దక్షిణాదిలో హిట్‌ అయిన చిత్రాలను రీమేక్‌ చేసినా, మరేదో మ్యాజిక్‌ చూపినా బాలీవుడ్‌ పడుతూ లేస్తూ ఉంది. మరి, ఈ ఏడాదిలో ఏయే హిందీ చిత్రాలు విడుదలయ్యాయి? వాటి ఫలితాలేంటి? గుర్తుచేసుకుందాం (Bollywood 2023 Roundup)..

కొత్త కళ తెచ్చిన ‘పఠాన్‌’

‘బాలీవుడ్‌కు అసలైన హిట్‌ ఎప్పుడు దక్కుతుందో?’ అని ఆశగా ఎదురుచూసిన వారికి, మరోవైపు ఎగతాళి చేసిన వారికి షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan) ‘పఠాన్‌’ (Pathaan)తో సమాధానమిచ్చారు. తన కెరీర్‌తోపాటు హిందీ చలన చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, బాలీవుడ్‌ బాక్సాఫీసుకు మళ్లీ ఊపిరి పోసింది. విడుదలకు ముందు పలు వివాదాలు చుట్టిముట్టినా ఆ రేంజ్‌లో కలెక్షన్స్‌ రాబట్టడం ఆషామాషీ విషయం కాదు. పైగా షారుక్‌ఖాన్‌ అప్పటికీ పెద్దగా ఫామ్‌లో కూడా లేరు. ఆశించిన ఫలితం ఇవ్వని ‘జీరో’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు ఆయన నుంచి వచ్చిన సినిమా ఇది. అదే నెలలో విడుదలైన అర్జున్‌ కపూర్, టుబుల ‘కుట్టీ’, అన్షుమాన్‌ ఝా, రిద్ధి డోగ్రాల ‘లక్కడ్‌బగ్గా’ తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద సౌండ్‌ చేయలేకపోయాయి. సిద్ధార్థ్‌ మల్హోత్ర, రష్మిక జంటగా నటించిన ‘మిషన్‌ మజ్ను’ (Mission Majnu), రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సుమిత్‌ వ్యాస్‌ల ‘ఛత్రివాలీ’ నేరుగా ఓటీటీల్లో రిలీజ్‌ అయి ఫర్వాలేదనిపించాయి.

రీమేక్స్‌తో మళ్లీ డీలా..!

‘పఠాన్‌’ సక్సెస్‌ని ఆస్వాదించేలోపే బాలీవుడ్‌ మళ్లీ డీలా పడింది. ఫిబ్రవరిలో విడుదలైన ఏ ఒక్క సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అగ్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ ‘సెల్ఫీ’ (మలయాళ సినిమా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రీమేక్‌) (Selfiee), కార్తీక్‌ ఆర్యన్‌ ‘షెహజాదా’ (తెలుగు సినిమా అల వైకుంఠపురములో రీమేక్‌) (Shehzada) ఘోర పరాజయం పొందాయి. కరణ్‌ మెహతా ‘ఆల్‌మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌’, జహన్‌ కపూర్‌ ‘ఫరాజ్‌’, షమితాశెట్టి ‘ది టెనెంట్‌’ తదితర సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి! నేరుగా ఓటీటీలో విడుదలైన యామీ గౌతమ్‌ ‘లాస్ట్‌’ ఆకట్టుకుంది.

వేసవిలో ఇలా..

మార్చిలో వచ్చిన అజయ్‌ దేవ్‌గణ్‌ ‘భోళా’ (తమిళ చిత్రం ఖైదీ రీమేక్‌) (Bholaa) (రూ.190కోట్లకుపైగా), రణ్‌బీర్‌ కపూర్‌ ‘తు ఝూతీ మై మక్కార్‌’ (Tu Jhoothi Main Makkaar) (రూ.220కోట్లకుపైగా), ఏప్రిల్‌లో వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan), మేలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) మినహా మరే సినిమా ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. విద్యుత్‌ జమ్వాల్‌ ‘ఐబీ 71’ పాజిటివ్‌ రివ్యూలు దక్కించుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ (తెలుగు సినిమా ఛత్రపతికి రీమేక్‌) సత్తా చాటలేకపోయింది. ‘కోట్‌’, ‘8ఏఎం మెట్రో’, ‘మ్యూజిక్‌ స్కూల్‌’, ‘సర్‌ మేడమ్‌ సర్పంచ్‌’ తదితర చిత్రాలు వినోదం పంచలేకపోయాయి. ఓటీటీలో విడుదలైన మనోజ్‌ బాజ్‌పాయ్‌ ‘సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai), సాన్యా మల్హోత్ర ‘కథల్‌’ ఆకట్టుకున్నాయి.

రెండు సినిమాలు.. రూ.200 కోట్లు!

జూన్‌లో విడుదలైన విక్కీకౌశల్‌ ‘జర హట్‌కే జర బచ్‌కే’ (Zara Hatke Zara Bachke), కార్తీక్‌ ఆర్యన్‌ ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha) రూ.100కోట్లుకుపైగా వసూళ్లు రాబట్టాయి. నేరుగా ఓటీటీలోకి వచ్చిన విజయ్‌ సేతుపతి ‘ముంబైకర్‌’ (తమిళ సినిమా మా నగరం రీమేక్‌), షాహిద్‌ కపూర్‌ ‘బ్లడీ డాడీ’ (తమిళ చిత్రం తూంగ వనమ్‌ రీమేక్‌), కంగనా రనౌత్‌ నిర్మించిన ‘టీకూ వెడ్స్‌ షేరు’, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘ఐ లవ్‌ యూ’, ఆంథాలజీ ‘లస్ట్‌స్టోరీస్‌ 2’ విజయానికి దూరంగా నిలిచాయి. టాలీవుడ్‌ అగ్ర నటుడు ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) హిందీ సహా మరే భాషలోనూ మెప్పించలేకపోయింది. అవికా గోర్‌ ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది.

జులైలో ఆ ఒక్కటే..!

జులైలో థియేటర్లలో విడుదలైన సినిమాల సంఖ్య చాలా తక్కువ. వాటిలో రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (సుమారు రూ. 355 కోట్లు) (Rocky Aur Rani Kii Prem Kahaani) మాత్రమే మంచి విజయాన్ని నమోదుచేసింది. రవీనా టాండన్‌ ‘వన్‌ ఫ్రైడే నైట్‌’, జెనీలియా ‘ట్రైల్‌ పీరియడ్‌’, వరుణ్‌ధావన్‌, జాన్వీకపూర్‌ల ‘బవాల్‌’, హ్యూమా ఖురేషి ‘తర్‌లా’ తదితర సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి.

మూడు సీక్వెల్స్‌.. అదుర్స్‌

ఆగస్టులో మూడు సీక్వెల్స్‌ విడుదలకాగా అన్నీ అదుర్స్‌ అనిపించాయి. అవే సన్నీ దేవోల్‌ ‘గదర్‌ 2’ (Gadar 2), అక్షయ్‌కుమార్‌ ‘ఓఎంజీ 2’ (OMG 2) (రూ.220 కోట్లకుపైగా), ఆయుష్మాన్‌ ఖురానా ‘డ్రీమ్ గర్ల్‌ 2’ (Dream Girl 2) (సుమారు రూ.140 కోట్లు). అభిషేక్‌ బచ్చన్‌ ‘ఘూమర్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రూ.691కోట్లకుపైగా వసూళ్లతో ‘గదర్‌ 2’ బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన 8వ సినిమాగా నిలిచింది.

ఈసారి ‘పఠాన్‌’కు మించి..

‘పఠాన్‌’ జోష్‌లో ఉన్న షారుక్‌ ఖాన్‌ కొన్ని నెలల వ్యవధిలోనే ‘జవాన్‌’ (Jawan)తో బాలీవుడ్‌కు మరో బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ అందించారు. ఆ చిత్రాన్ని కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా సుమారు రూ.1148 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టి ‘పఠాన్‌’ని మించింది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో ఇలాంటి విజయాల్ని అందుకోవడం ఓ రికార్డు. ‘జవాన్‌’ మినహా సెప్టెంబరులో ప్రేక్షకులను ప్రభావితం చేసిన సినిమాలు లేవు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్‌ వార్‌’తో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు.

అక్టోబరు.. అంతా ఫెయిల్యూర్‌!

అక్షయ్‌కుమార్‌ ‘మిషన్‌ రాణిగంజ్‌’ (Mission Raniganj), టైగర్‌ ష్రాఫ్‌ ‘గణపథ్‌’ (Ganapath), కంగనా రనౌత్‌ ‘తేజస్‌’ (Tejas) సహా అక్టోబరులో విడుదలైన సినిమాలన్నీ ఫెయిల్యూర్‌ అయ్యాయి. దియా మీర్జా, ఫాతిమా సనాల ‘ధక్‌ ధక్‌’ (Dhak Dhak) కాస్త అలరించింది.

నవంబరు.. టైగర్‌

నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ఇషాన్‌ ఖట్టర్‌ ‘పిప్పా’ (Pippa), థియేటర్‌లో విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ 3’ (Tiger 3) ప్రేక్షకాదరణ పొందాయి. ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.465 కోట్లు కలెక్ట్‌ చేసింది. ‘ఆంఖ్‌ మిచోలీ’, ‘ది లేడీ కిల్లర్‌’, ‘త్రీ ఆఫ్‌ అజ్‌’ తదితర చిత్రాలు మెరవలేకపోయాయి.

చివరి నెల.. ‘యానిమల్‌’దే హవా

డిసెంబరులో ఇప్పటి వరకు విడుదలైన వాటిలో ‘యానిమల్‌’ (Animal)దే హవా. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా హిందీ, తెలుగులోనూ సత్తా చాటింది. డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.772కోట్లకుపైగా వసూళ్లు చేసింది. విక్కీ కౌశల్‌ ‘సామ్‌ బహాదుర్‌’తో ఆకట్టుకున్నారు. షారుక్‌ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నంద తదితరులు కలిసి నటించిన ‘ది ఆర్చిస్‌’ (The Archies), ‘కడక్‌ సింగ్‌’ నేరుగా ఓటీటీలో విడుదలై అలరిస్తున్నాయి. షారుక్‌ మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అదే ‘డంకీ’ (Dunki). ఈ నెల 21న విడుదలకానుంది.

ఈ ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలైన హిందీ సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. అది కూడా బాక్సాఫీసు వసూళ్లపై ప్రభావం చూపే అంశమే. రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది 10 చిత్రాలు మాత్రమే. వాటిలో దక్షిణాది దర్శకులు తెరకెక్కించిన రెండు సినిమాలు (జవాన్‌, యానిమల్‌) ముందు వరుసలో ఉండడం విశేషం. దీన్నిబట్టి.. రొటీన్‌ కంటెంట్‌, రీమేక్స్‌ను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా లేరని మేకర్స్‌ గుర్తిస్తే వచ్చే ఏడాదిలో సగం హిట్‌ కొట్టినట్లే!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని