Jr NTR Speech at Tillu Square Success Meet: ‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్‌

‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) అన్నారు.

Updated : 09 Apr 2024 00:35 IST

హైదరాబాద్‌: ‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కీలక పాత్రలో మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో సిద్ధు నటించిన సినిమాలు చూశా. కానీ, ఎప్పుడూ కలవలేదు. కరోనా తర్వాతే కలిశా. అతడికి సినిమా తప్ప మరో ధ్యాసే లేదు. ‘డీజే టిల్లు’ క్యారెక్టర్‌ చూసి సిద్ధు బయట కూడా అలాగే ఉంటాడేమోనని మీరంతా అనుకోవచ్చు. కానీ, అతను చేస్తున్న పాత్ర, కథకు న్యాయం చేయగలనా? అనే తపనతో ఉంటాడు. డీజే టిల్లు మూవీతో కేవలం సక్సెస్‌ను మాత్రమే కాదు, మన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే క్యారెక్టర్‌ను ఇచ్చాడు. చిన్నప్పుడు విపరీతంగా కార్టూన్‌ పాత్రలను చూసేవాడిని. అలాంటి పాత్రలు సినిమాల ద్వారా మన జీవితంలోకి వస్తే బాగుంటుందని అనుకునేవాడిని. టిల్లు ద్వారా సిద్ధు.. మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు. నేను నవ్వడం మొదలు పెడితే ఆపుకోవడం కష్టం. ఈ సినిమా చూసి ‘ఇక నవ్వలేను బాబోయ్‌’ అనిపించాడు. ఇలాంటి  అద్భుతమైన పాత్రలు, కథలు అతడు ఇంకా చేయాలి’’

‘‘దేవర’లో ఒక డైలాగ్‌ ఉంది. భయం గురించి ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడుతాం. ‘కల కనడానికి ఓ ధైర్యం ఉండాలి. ఆ కలని సార్థకం చేసుకోవడానికి భయం ఉండాలి’ టిల్లు స్క్వేర్‌ బృందం భయపడుతూ, శ్రద్ధతో తీశారు కాబట్టే ఇంతటి ఘన విజయం సాధించింది. కష్టానికి కొలమానం అంటూ లేదు. నా కష్టం, నీ కష్టం వేరు కాదు. అందరి కష్టం ఒక్కటే. సిద్ధు.. కష్టాన్ని నమ్ముకో. విశ్వక్‌, సిద్ధులపై నాకు ఎంతో నమ్మకం ఉంది. చిత్ర పరిశ్రమ మరింత ముందుకు వెళ్లడానికి వీరిద్దరూ కృషి చేస్తారు. ఇండస్ట్రీకి ఇలాంటి డేర్‌ డెవిల్స్‌ కావాలి. ఒక బ్లాక్‌బస్టర్‌ అయిన సినిమాకు సీక్వెల్‌ చేయడం మామూలు విషయం కాదు. మల్లిక్‌ రామ్‌కు అభినందనలు. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. నేహా, అనుపమ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరూ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించి ఉండేది కాదు. గీత రచయిత కాసర్లశ్యామ్‌ పాటల్లో మట్టి వాసన పరిమళిస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో కథానాయకులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌, దర్శకుడు త్రివిక్రమ్‌, కథానాయికలు అనుపమ పరమేశ్వరన్‌, నేహాశెట్టి ‘టిల్లు స్క్వేర్‌’ చిత్ర బృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని