Nag Ashwin: ‘బుజ్జి’ విషయంలో.. ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ విజ్ఞప్తి

ఎలాన్‌ మస్క్‌కు టాలీవుడ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే?

Published : 29 May 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బుజ్జి’ అనే వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk)ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కోరారు. ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో ‘బుజ్జి’ (Bujji) చేసిన ప్రయాణానికి సంబంధించిన విజువల్స్‌ ఒకరు పోస్ట్‌ చేయగా.. దానిపై డైరెక్టర్‌ స్పందించారు. ‘‘డియర్‌ ఎలాన్‌ మస్క్‌ సర్‌.. మా బుజ్జిని చూసేందుకు, నడిపేందుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వెహికల్‌. ఇండియాలోనే తయారైంది. బరువు 6 టన్నులు. మీ (టెస్లా) సైబర్‌ట్రక్‌, బుజ్జి కలిసి దూసుకెళ్తుంటే చూసేందుకు బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై మస్క్ ఎలా స్పందిస్తారోనని నెటిజన్లు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?

నాగ్‌ అశ్విన్‌ ఇతిహాసాలను టచ్ చేస్తూ ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీని తెరకెక్కించారు. హీరో ప్రభాస్‌ (Prabhas).. భైరవగా నటించారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ‘బుజ్జి’ కూడా కీ రోల్‌ ప్లే చేయనుంది. దానికి ప్రముఖ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. ఈ అధునాతన వాహనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఇటీవల ఓ వేడుక నిర్వహించారు. దీంతో, నెట్టింట బుజ్జి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌ హీరో నాగచైతన్య దాన్ని డ్రైవ్‌ చేసి, థ్రిల్‌ ఫీలయ్యానన్నారు. కల్కి చిత్ర బృందం ఇంజినీరింగ్‌కు సంబంధించిన రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేసిందన్నారు. బుజ్జి, భైవరకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Bujji and Bhairava on Prime)లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సినిమా జూన్‌ 27న (Kalki Movie Release Date) ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని