kalki 2898 ad: భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?

kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

Updated : 25 May 2024 14:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి: 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. ఈ చిత్రంలో కారు (బుజ్జి) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ కారు గురించి తెలుసుకునేందుకు, దానిని మళ్లీ మళ్లీ చూసేందుకు సినీతారల దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల వరకూ ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

 • ‘కల్కి’ మూవీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, ఆయన టీమ్‌ ‘బుజ్జి’ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఇందుకోసం వందల స్కెచ్‌లు వేశారు. కారుకు రూపు రేఖలు ఇవ్వడానికి ఏకంగా ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లను చదవాల్సి వచ్చిందని నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడంటే దీని తయారీ కోసం ఎంత పరిశోధన చేశారో అర్థం చేసుకోవచ్చు.
 • కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలైన మహీంద్రా, జయం మోటార్స్‌ (కోయంబత్తూరు) ఇంజినీర్లు సహకారం అందించారు.
 • కారుకు 34.5 అంగుళాల సైజు కలిగిన రిమ్స్‌ను అమర్చగా, ప్రత్యేకంగా సియట్‌ వాళ్లు టైర్లను డిజైన్‌ చేసి ఇచ్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్‌తో అల్యూమినియం అలాయ్‌ వీల్స్‌ను తయారు చేశారు.
 • కారు టైరుకు టేపరోలింగ్‌ బేరింగ్స్‌, హాలో హబ్స్‌ను జత చేశారు. మూడు టైర్లకు ఉన్న ఒక్కో స్వింగ్‌ ఆర్మ్‌ బరువు దాదాపు టన్ను బరువు ఉంటుంది. మొత్తం కారు బరువు ఏకంగా ఆరు టన్నులు.
 • కారు మొత్తం పొడవు 6075 MM; వెడల్పు 3380 MM; ఎత్తు 2186 MM. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 180 MM
 • రియర్‌ వీల్‌ సస్పెన్షన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింగ్‌లను అమర్చి ఎటు కావాలంటే అటు తిరిగేలా చక్రాలను డిజైన్‌ చేశారు.
 • కారుపైన ఉన్న డోర్‌ను దృఢమైన ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేశారు.
 • ఇక ఇంజిన్‌ విషయానికొస్తే, లోపల రెండు ఎయిర్‌ కూల్డ్‌  క్రిల్లోస్కర్‌ ఇండక్షన్‌ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ను అమర్చి, దాన్ని రియర్‌ టైర్‌కు కనెక్ట్‌ చేశారు.
 • ఆరు టన్నుల బరువు కలిగిన ఈ వాహనం కదలాలంటే భారీగానే శక్తి కావాలి. ఇందులో అమర్చిన ఇంజిన్‌ 94 కిలోవాట్‌ పీక్‌ పవర్‌, 9800 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 47 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ను కారులో అమర్చారు.
 • బుజ్జి కారును సులువుగా నడిపేందుకు ఎలక్ట్రో హైడ్రాలిక్‌ స్ట్రీరింగ్‌ను అమర్చారు.  ఇది కారులోని ఎలక్ట్రిక్‌ మోటార్‌కు, అది రియర్‌ వీల్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది.
 • అంతేకాదండోయ్‌ ఈ బుజ్జి సినిమాలో మాట్లాడుతుంది కూడా. మరి మన బుజ్జికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? ఇంకెవరు కథానాయిక కీర్తి సురేష్‌.

బుజ్జిని డ్రైవ్‌ చేసిన నాగ చైతన్య..

బుజ్జి కారును పరిచయం చేసినప్పటి నుంచి ఒక్కసారైనా డ్రైవ్ చేయాలనుందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు రేసర్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ సూపర్‌ పవర్‌ఫుల్‌ బుజ్జిని హీరో నాగచైతన్య డ్రైవ్‌ చేశారు. దానికి సంబంధించిన వీడియోను కల్కి చిత్రబృందం పంచుకోగా, అది వైరల్‌గా మారింది. అక్కినేని కుటుంబానికి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఆసక్తి ఉందో మనకు తెలిసిందే. అలాగే రేసింగ్‌ గేమ్స్‌లోనూ ఈ హీరోలు సందడి చేస్తుంటారు. తాజాగా నాగచైతన్య బుజ్జిని డ్రైవ్‌ చేసి థ్రిల్‌ అయ్యారు. ‘బుజ్జిని నడపడం అద్భుతంగా ఉంది. నేనింకా షాక్‌లో ఉన్నాను. కల్కి చిత్ర బృందం ఇంజినీరింగ్‌కు సంబంధించిన రూల్స్‌ అన్నీ బ్రేక్‌ చేసింది’ అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. ‘ఇలాంటి కారును డ్రైవ్‌ చేస్తానని జీవితంలో ఊహించలేదు. ఇదొక ఇంజినీరింగ్‌ మార్వెల్‌. దర్శకుడి ఊహాశక్తిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన మొత్త చిత్ర బృందానికి హ్యాట్సాఫ్‌. బుజ్జితో గడిపిన సమయం అద్భుతంగా ఉంది’ అని నాగచైతన్య ట్వీట్ చేశారు.

ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్గా ‘కల్కి : 2898 ఏడీ’ రూపొందుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కల్కి’ ఫస్ట్‌ పార్ట్‌ జూన్‌ 27న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని