Netflix Movies 2024: నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది అలరించే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో గురువారం కొత్త చిత్రాలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ప్రస్తుతం ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన సినిమాలు, సిరీస్‌లు ఏంటి? అందులో ఎవరెవరు నటిస్తున్నారు?

Published : 29 Feb 2024 17:43 IST

పీరియాడిక్‌ డ్రామా ‘హీరామండి’

చరిత్రకు సంబంధించిన కథలను ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీదనంతో పాటు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పటివరకూ వెండితెరపై తన సత్తా చాటిన ఆయన ఇప్పుడు ఓటీటీలోనూ తనదైన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్‌ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌.  బ్రిటీష్‌రాజ్‌కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.  మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.


పోలీస్‌ ఆఫీసర్‌గా తొలిసారి కాజోల్‌

కృతి సనన్‌, కాజోల్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దోపట్టి’. శశాంక చతుర్వేది దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇందులో కాజోల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్‌.. సినిమాపై అంచనాలను పెంచింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.


మిస్టరీ థ్రిల్లర్‌ ‘మర్డర్‌ ముబారక్‌’

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్స్‌కు థ్రిల్‌ పంచేందుకు వస్తున్న మరో చిత్రం ‘మర్డర్‌ ముబారక్‌’. పంకజ్‌ త్రిపాఠీ, సారా అలీఖాన్‌, విజయ్ వర్మ, డింపుల్‌ కపాడియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోమి అడజానియా దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఐదుగురు మహిళలు.. డ్రగ్‌ డీలింగ్స్‌..

షబానా అజ్మీ, జ్యోతిక, నిమేషా సజయన్‌, సాయి తమంకర్‌, షాలినీపాండే కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘డబ్బా కార్టెల్‌’. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ‘ఈ డబ్బాను కచ్చితంగా మర్చిపోవద్దు..’ అంటూ పేర్కొంది. ఐదుగురు మహిళలు డ్రగ్‌ డీలింగ్‌, ట్రేడింగ్‌ ఎలా చేశారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు ఏంటి? అన్నది చూపించనున్నారు. హితేష్‌ భాటియా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు.


కాందహార్‌ హైజాక్‌

ప్రపంచ ఏవియేషన్‌ చరిత్రలోనే ఐసీ 814 (ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 814) హైజాక్‌ అతి పెద్దది. 30వేల అడుగుల ఎత్తులో 188 మంది ప్రయాణికులను ఉగ్రవాదులు ఎలా బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు చేసిన దారుణం ఏంటి? వంటి అంశాలతో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘ఐసీ 814’. విజయ్‌వర్మ, పంకల్‌ కపూర్, అరవింద స్వామి, నసీరుద్దీన్‌ షా, దియా మీర్జా తదితరులు కీలకపాత్రలు పోషించారు.  అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించి తెరకెక్కించారు. 1999లో జరిగిన ఈ హైజాక్‌ తామే చేశామని హర్కతుల్‌ ముజాహిదీన్‌ అనే ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.  కాఠ్‌మండ్‌ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి, అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 17 మంది గాయపడ్డారు.


మార్చి 1 నుంచి మామ్లా లీగల్‌ హై

విక్రమ్‌ ప్రతాప్‌, అమిత్‌ విక్రమ్‌ పాండే, రర్మా శర్మ, రవి కిషన్‌ కీలకపాత్రల్లో నటించిన లీగల్‌ కామెడీ డ్రామా ‘మామ్లా లీగల్‌ హై’. మార్చి 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.  రాహుల్ పాండే దర్శకత్వం వహించారు.


‘యే కాలీ కాలీ అంఖీన్’ సీజన్‌-2

తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, శ్వేత త్రిపాఠి, సౌరభ్‌ శుక్లా, బిజేంద్ర కాలా తదితరులు నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘యే కాలీ కాలీ అంఖీన్‌’. 2022లో వచ్చిన ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఇప్పుడు సీజన్‌2 రాబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సిరీస్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. సిద్ధార్థ్‌ సేన్ గుప్త ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.


మిస్‌ మ్యాచ్‌ సీజన్‌3 కూడా వస్తోంది

యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ ‘మిస్‌ మ్యాచ్‌’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ముచ్చటగా మూడోసారీ అలరించడానికి సిద్ధమైంది. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రజక్త కోలి, రోహిత్‌ సరాఫ్‌, రణ్‌విజయ్‌ సింఘా, విద్య మాల్వేదే తదితరులు నటిస్తున్నారు.


నీరజ్‌ పాండే ‘ఖాకీ’ ఈసారి ఎక్కడంటే?

నీరజ్‌ పాండే దర్శకత్వంలో వచ్చిన ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న మరో ఆసక్తికర సిరీస్‌ ‘ఖాకీ: ది బెంగాల్‌’ చాప్టర్‌. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ కూడా ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.  దీంతోపాటు, నీరజ్‌ పాండే రూపొందించిన ‘సికిందర్‌ కా ముగ్దార్‌’ కూడా రెడీ అవుతోంది.


‘కోటా ఫ్యాక్టరీ 3’ వచ్చేస్తోంది

కోటా ఫ్యాక్టరీ సీజన్‌-1, 2లు ప్రేక్షకులను అలరించాయి. అంతకుమించి భావోద్వేగాలను పంచాయి. ఇప్పుడు మూడో సీజన్‌ కూడా రాబోతోంది.  కోచింగ్ సెంటర్‌లకు ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ హబ్ రాజస్థాన్‌లోని కోటా నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. ఐఐటీ, సివిల్స్‌ ర్యాంకుల కోసం విద్యార్థులు పడే కష్టం, ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో దీన్ని తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.  జితేంద్రకుమార్, అహ్సాస్ చన్నా, ఆలంఖాన్, రంజన్ రాజ్, రేవతి పిళ్లై, ఉర్విసింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌరభ్ ఖన్నా దర్శకత్వం వహించారు.  ప్రిలిమ్స్‌ కోసం విద్యార్థులు పడే కష్టాన్ని తొలి రెండు సిరీసుల్లో చూపించగా, మెయిన్స్‌ కోసం పడే ఇబ్బందులను ప్రధానంగా చూపించనున్నారు.


మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని