Paarijatha Parvam: ఓటీటీలోకి క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

ఇటీవల విడుదలైన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘పారిజాత పర్వం’. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 07 Jun 2024 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైతన్యరావు, శ్రద్ధాదాస్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). కిడ్నాప్‌ ఈజ్‌ ఎన్‌ ఆర్ట్‌.. అన్నది ఉప శీర్షిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహా (Aha) వేదికగా జూన్‌ 12 నుంచి ప్రసారం కానుంది. కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే ఈ కథను సంతోష్‌ కంభంపాటి తెరకెక్కించగా. సునీల్‌, వైవా హర్ష తదితరులు నటించారు.

మహేశ్‌కి ట్రెండ్‌ అయిన టైటిల్‌తో విజయ్‌ సేతుపతి.. ఎన్టీఆర్‌ మూవీకి ఇలాగే..!

క‌థేంటంటే: హీరో కావాలన్న ల‌క్ష్యంతో భీమ‌వ‌రం నుంచి భాగ్యనగరానికొస్తాడు శ్రీను (సునీల్‌). ఎలాగైనా అవ‌కాశాలు అందిపుచ్చుకోవాల‌నే ల‌క్ష్యంతో సినిమా వాళ్లు ఎక్కువ‌గా వ‌చ్చిపోయే కృష్ణాన‌గ‌ర్‌లోని ఓంకార్ బార్‌లో వెయిట‌ర్‌గా చేర‌తాడు. అక్కడే పార్వతి (శ్రద్ధా దాస్‌) డ్యాన్యర్‌గా ప‌ని చేస్తుంటుంది. ఓసారి త‌న‌కు ఆ బార్ ఓన‌ర్ నుంచి పెద్ద స‌మ‌స్య ఎదుర‌వ‌గా.. ఆమెను కాపాడ‌బోయే క్రమంలో శ్రీను ఆ ఓన‌ర్‌ను చంపేస్తాడు. ఇత‌ని క‌థ‌నే సినిమా స్ర్కిప్ట్‌గా తీసుకొని దర్శకత్వ ప్రయత్నాలు చేస్తుంటాడు చైత‌న్య (చైత‌న్య రావు). అయితే, ఆ క‌థ కొంద‌రు నిర్మాత‌ల‌కు న‌చ్చినా.. చైతూ త‌న‌ ఫ్రెండ్ హ‌ర్ష (హ‌ర్ష చెముడు) హీరోగా చేస్తాడ‌నేస‌రికి వాళ్లంతా వెన‌క‌డుగేస్తుంటారు. దీంతో విసిగిపోయిన చైతూ త‌న క‌థ‌ను తానే నిర్మించాలనే నిర్ణయానికొస్తాడు. అందుకు కావాల్సిన డ‌బ్బు సంపాదించ‌డానికి ఎవ‌రినైనా కిడ్నాప్ చేయాల‌నుకుంటాడు. త‌న‌ని బాగా అవ‌మానించిన నిర్మాత‌ల్లో ఒక‌రైన శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్‌)ని ల‌క్ష్యంగా చేసుకొని.. అత‌ని భార్య సురేఖ‌ (సురేఖ వాణి)ను కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగుతాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? వీళ్లిద్ద‌రిలో ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేస్తారు? ఈ క్రమంలో చైతూ గ్యాంగ్‌కు.. బార్ శ్రీను గ్యాంగ్‌కు ఎదురైన‌ స‌వాళ్లేంటి? సినిమా చేయాల‌న్న చైత‌న్య ల‌క్ష్యం నెర‌వేరిందా?  లేదా? అన్నది అసలు కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని