Mahesh Babu: మహేశ్‌కి ట్రెండ్‌ అయిన టైటిల్‌తో విజయ్‌ సేతుపతి.. ఎన్టీఆర్‌ మూవీకి ఇలాగే..!

మూవీ టైటిల్స్‌ విషయంలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికర ట్రెండ్‌ నడుస్తోంది. ఒక హీరో మూవీకి సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయిన టైటిల్‌తో మరో హీరో వచ్చేస్తున్నాడు.

Published : 07 Jun 2024 17:05 IST

హైదరాబాద్‌: తమ అభిమాన కథానాయకుడి సినిమా ప్రకటించగానే అందరూ ‘టైటిల్‌ ఏం పెడతారో’ అని చర్చిస్తూ ఉంటారు. ఇక సామాజిక మాధ్యమాల వేదిక ఆ టైటిల్స్‌తో వచ్చే పోస్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్‌ జానర్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న మూవీ కావడంతో అందరికీ సులభంగా చేరువయ్యేలా ‘మహారాజ్’ అనే పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటూ టాక్‌ వినిపించింది. చిత్ర బృందం అధికారికంగా స్పందించకపోయినా దీనిపై సోషల్‌మీడియాలో బాగానే టాక్‌ నడిచింది. అయితే, ఇప్పుడు ఇదే టైటిల్‌తో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి వస్తున్నారు. తన కెరీర్‌లో 50వ సినిమాగా ‘మహారాజ’ అంటూ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోతున్నారు. నిథిలన్‌ దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై ఆసక్తిని పెంచింది. మహేశ్‌బాబు మూవీ టైటిల్‌ అంటూ సాగిన ప్రచారానికి ఈ విజయ్‌ సేతుపతి మూవీ ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది.

ఎన్టీఆర్‌ టైటిల్‌ విషయంలోనూ ఇదే చర్చ

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఓ మూవీ చేయనున్నారు. ‘సలార్‌-2’ తర్వాత నీల్‌ తీయబోయే సినిమా ఇదే కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ‘డ్రాగన్‌’ అంటూ ట్రెండ్‌ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అదే టైటిల్‌తో తన సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు దర్శక, నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో ఎన్టీఆర్‌, నీల్‌ మూవీకి మరో టైటిల్‌ ట్రెండ్‌ ఆగిపోయింది.

‘కల్కి’ కన్‌ఫ్యూజన్‌.. మూడు చిత్రాలు ట్రెండింగ్‌

ఒకే టైటిల్‌తో వేర్వేరు చిత్రాలు వచ్చిన సందర్భాలెన్నో. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితే తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అత్యంత భారీ బడ్జెట్‌, తారాగణంతో సైన్‌ఫిక్షన్‌ మూవీగా ఇది రానుంది. సోషల్‌మీడియా ట్రెండ్స్‌లో ‘కల్కి’ కోసం వెతుకుతుంటే మరో రెండు ఆసక్తికర చిత్రాలూ దర్శనమిస్తున్నాయి. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ నటించని ‘కల్కి’ పోస్టర్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక మలయాళ హీరో టొవినో థామస్‌ నటించిన ‘కల్కి’ తాజాగా తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ (kalki movie review) అవుతోంది. ఇలా ఒకే టైటిల్‌తో మూడు సినిమాలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని