Priyamani: ఆ స్టార్‌ హీరోతో నటించేందుకు భయపడ్డా.. కానీ: ప్రియమణి

ఓ స్టార్‌ హీరోతో కలిసి నటించేందుకు తాను భయపడినట్లు నటి ప్రియమణి తెలిపారు. ఆయనెవరంటే?

Published : 10 Apr 2024 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ ప్రముఖ హీరో మోహన్‌లాల్‌ (Mohanlal)తో కలిసి నటించేందుకు తాను తొలుత భయపడ్డానని నటి ప్రియమణి (Priyamani) పేర్కొన్నారు. మరోవైపు, తాను గతంలో నటించిన రావణ్‌/విలన్‌ సినిమా చిత్రీకరణను గుర్తు చేసుకున్నారు. తన కొత్త సినిమా ‘మైదాన్‌’ ప్రచారంలో భాగంగా ప్రియమణి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. మోహన్‌లాల్‌తో పనిచేసిన అనుభవం గురించి ప్రియమణి మాట్లాడుతూ..‘‘నేను చిన్నప్పటినుంచి మోహన్‌లాల్‌ సర్‌ను చూస్తూ పెరిగా. అందుకే ఆ హీరోతో కలిసి నటించే అవకాశం (గ్రాండ్‌మాస్టర్‌ మూవీ) వచ్చినప్పుడు భయపడ్డా.  కానీ, కొన్ని రోజులకు ఆ భయం పోయింది. ఆయన సెట్‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతీ సన్నివేశానికి తనదైన శైలిలో మెరుగులు దిద్దుతారు. అవి చాలా చిన్న మార్పులే అయినా పాత్రకు మరింత అందాన్ని ఇస్తాయి. ఆయనతో కలిసి రెండుసార్లు పనిచేయడం (గ్రాండ్‌మాస్టర్‌, నెరు) నాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని అన్నారు.

రివ్యూ: మైదాన్‌

‘విలన్‌’ సినిమా గురించి చెబుతూ.. ‘‘ఓ అవార్డు కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నం నాతో తొలిసారి మాట్లాడారు. నేను నటించిన ‘పరుత్తివీరన్’ చూశానని చెప్పిన ఆయన తన ఆఫీసుకు రావాలని కోరారు. మరుసటిరోజు ఉదయాన్నే ఆ ఆఫీస్‌ నుంచి నాకు కాల్ వచ్చింది. క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికెళ్లా. ఆయన ‘రావణ్‌’ (తెలుగులో విలన్‌) సినిమాలో నాకు కీలక పాత్ర ఇస్తున్నట్లు చెప్పారు. ఆ సమయానికి ఆ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ మాత్రమే ఖారారైనట్లు తెలిపారు. అందులో నేను వెన్నెల పాత్రలో నటించా. వెన్నెల సామూహిక అత్యాచారానికి గురైన సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. దాన్ని సింగిల్ టేక్‌లో చేశాం. నాకు చాలాసేపు కన్నీళ్లు ఆగలేదు. తర్వాత, మణి సర్‌ మా అమ్మను కలిసినప్పుడు ‘ప్రియమణి వద్ద కుళాయి ఏమైనా ఉందా.. ఒక్కసారి ఏడవడం మొదలుపెడితే ఆపదు. ప్రవాహంలా కన్నీరు వస్తూనే ఉంటుంది’ అని అన్నారు.  ఆ మాట విని నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆయన సినిమాల్లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’’ అని తెలిపారు.

తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సినిమాల్లో తాను ఎందుకు నటించలేదో ప్రియమణి వివరించారు. ‘‘టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో అగ్రహీరోల సినిమాల్లో నేను ఎందుకు నటించలేదో ఇప్పటికీ ఆశ్చర్యమే. దీనికి సమాధానం ఈ రోజు వరకూ దొరకలేదు. ఈవిషయాన్ని దర్శక, నిర్మాతలే చెప్పాలి. నేను ఈ విషయంలో ఏ వ్యక్తినీ నిందించాలనుకోవడం లేదు. కానీ, నేను టాప్‌ హీరోల సినిమాల్లో నటించకూడదని చాలామంది కోరుకున్నారు. కారణమేమైనా దీనిగురించి నేను పెద్దగా ఆలోచించాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాను’’ అని తెలిపారు. భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ సయ్యద్‌ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్‌’లో అజయ్‌ దేవ్‌గణ్‌ హీరో. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని