Maidaan Movie Review: రివ్యూ: మైదాన్‌.. అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా మెప్పించిందా?

భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ సయ్యద్‌ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్‌’ మూవీ ఎలా ఉంది?

Updated : 10 Apr 2024 16:50 IST

Maidaan Movie Review; చిత్రం: మైదాన్‌, నటీనటులు: అజయ్ దేవగణ్‌, గజరాజ్ రావ్, ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ, దేవయాన్ష్‌ త్రిపాఠి, ఆయేషా వింద్రా, మీనల్‌ పటేల్‌, బహురాల్‌ ఇస్లాం తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్‌; ఎడిటింగ్‌: దేవ్‌ రావ్‌ జాదవ్‌, షానవాజ్‌ మోసాని; సినిమాటోగ్రఫీ: తుషార్‌ కాంతిరాయ్‌, ఫ్యోడర్‌ లియాస్‌; నిర్మాతలు: బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా; దర్శకుడు: అమిత్ శర్మ; విడుదల:  ఏప్రిల్‌ 10-04-2024

ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn). ఇటీవల ‘షైతాన్‌’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు ‘మైదాన్‌’ (Maidaan Movie Review) అంటూ స్పోర్ట్స్‌ డ్రామాతో రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకులను పలకరించడానికి వచ్చారు. మరి ఈ చిత్ర కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: అది 1952. హెల్సెంకీ ఒలింపిక్స్‌. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత ఫుట్‌బాల్‌ జట్టు, యుగోస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. యుగోస్లేవియా ఏకంగా 10 గోల్స్‌ కొడుతుంది. సరైన బూట్లు కూడా లేని భారత ఆటగాళ్లు గాయాలపాలవుతారు. ఒలింపిక్స్‌లో భారత్‌ ఓటమిని ఎత్తి చూపుతూ పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తాయి. ఈ క్రమంలో భారత ఫుట్‌బాల్‌ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్న కోచ్‌ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్‌) ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, జట్టును మళ్లీ ఎలా సిద్ధం చేశాడు? అనంతరం జరిగిన టోర్నమెంట్‌లలో టీమ్‌ ఇండియా ఎలా రాణించింది? (Maidaan Movie Review) ఈ క్రమంలో సయ్యద్‌, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయాలు, వ్యక్తులకు సంబంధించిన జీవిత గాథలు ఎన్నో వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. సయ్యద్‌ అబ్దుల్‌ రహీం ఉన్న కాలాన్ని భారత ‘ఫుట్‌బాల్‌’కు స్వర్ణయుగంగా పేర్కొంటారు. హైదరాబాదీ అయిన అబ్దుల్‌ జీవిత చరిత్రకు భావోద్వేగాలు జోడించి తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు అమిత్‌శర్మ విజయం సాధించారు. 1952 ఒలింపిక్స్‌లో భారతజట్టు ఘోర ఓటమితో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి జట్టుకు ఎదురయ్యే అవమానాలు, కోచ్‌ సయ్యద్‌-ఫుట్‌బాల్‌ కమిటీకి మధ్య జరిగే చర్చలతో నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు పదునైన ఆటగాళ్ల కోసం సయ్యద్‌ వేట మొదలుపెట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఎలా వర్క్‌ చేస్తుంది?సయ్యద్‌ మట్టిలో మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను ఎలా వెతికి పట్టుకున్నాడు తదితర సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ క్రమంలో సన్నివేశాలన్నీ నెమ్మదిగా సాగడంతో ప్రేక్షకుడి సహనానికి కాస్త పరీక్ష పెడతాయి.

ద్వితీయార్ధం నుంచి కథ కొత్త టర్న్‌ తీసుకుంటుంది. ఫుట్‌బాల్‌ టీమ్‌ సిద్ధమైన తర్వాత ఆట కోసం వాళ్లను సిద్ధం చేయడం, అందుకు సయ్యద్‌ శిక్షణ ఇవ్వడం తదితర సన్నివేశాలను చూపిస్తూనే మరోవైపు సయ్యద్‌ వ్యక్తిగత జీవితాన్ని కూడా దర్శకుడు చూపించాడు. ఈ క్రమంలో ఆటగాళ్లను ఉద్దేశిస్తూ సయ్యద్‌ ఇచ్చే ఎమోషనల్ స్పీచ్‌లు భావోద్వేగ భరితంగా సాగుతాయి. (Maidaan Movie Review) ఇక ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అదే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మ్యాచ్‌లను చిత్రీకరించిన తీరు సహజంగా ఉండటమే అందుకు కారణం. టీమ్ ఇండియా గోల్‌ కొట్టిన ప్రతిసారీ ప్రేక్షకుడే ఆ గోల్‌ కొట్టిన ఆనందాన్ని పొందుతాడంటే అతిశయోక్తి కాదు. పతాక సన్నివేశాలు భావోద్వేగంతో  ప్రతి ఒక్కరిలోనూ కన్నీళ్లు వచ్చేలా చేస్తాయి. సినిమా పూర్తయిన తర్వాత ‘మైదాన్‌’ ట్రాన్స్‌లోనే ఉండిపోతాం.

ఎవరెలా చేశారంటే: ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ ఒదిగిపోయారు. జట్టుకు శిక్షణ ఇవ్వడం, ఉత్తేజపరచడం, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో ఆయన నటన టాప్‌నాచ్‌. గజరాజ్‌ రావు, ప్రియమణి, ఆటగాళ్లుగా చేసిన యువకులు తదితరులు తమ పరిధి మేరకు నటించారు.  ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. మ్యాచ్‌ జరగుతున్నప్పుడు వచ్చే నేపథ్య సంగీతం వాటిలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. (Maidaan Movie Review) కథ, కథనాలను డీటెలియింగ్‌ చెప్పడం కోసం సినిమాను మూడు గంటలు నడపటమన్నది దర్శకుడు అమిత్‌శర్మ తీసుకున్న రిస్క్‌ అనే చెప్పవచ్చు. ప్రథమార్ధంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా అమిత్‌ ఆ ఆప్షన్‌ను ఎంచుకోలేదు. ఆటగాళ్లను ఉద్దేశించి అజయ్‌ దేవ్‌గణ్‌ ఇచ్చే స్పీచ్‌లు ‘చెక్‌ దే ఇండియా’ను తలపిస్తాయి. మూవీ ఒక కోర్‌ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా మలచడంలో మాత్రం అమిత్‌కు మంచి మార్కులే పడతాయి.

  • బలాలు
  • + అజయ్‌ దేవ్‌గణ్‌ నటన
  • + ద్వితీయార్ధం
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - నిడివి
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: మైదాన్‌ ఎమోషనల్‌ స్పోర్ట్స్‌  డ్రామా(Maidaan Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని