Raja Saab: ఆ చిత్రంతో ‘రాజాసాబ్‌’ను పోల్చలేం: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌

ప్రభాస్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్‌’. ఈ సినిమా గురించి నిర్మాత విశ్వ ప్రసాద్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 07 Feb 2024 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD), ‘రాజాసాబ్‌’ (Raja Saab)లను విజువల్స్‌ విషయంలో ఒకదానితో ఒకటి పోల్చలేమని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ (TG Vishwa Prasad) అన్నారు. దేనికదే ప్రత్యేకమని పేర్కొన్నారు. రవితేజ (Ravi Teja) హీరోగా ఆయన నిర్మించిన ‘ఈగల్‌’ (Eagle) ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారాయన. ఆ చిత్ర విశేషాలతోపాటు తాను నిర్మిస్తున్న ‘రాజాసాబ్‌’ సంగతులు పంచుకున్నారు. ఇందులో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. దాదాపు 45 శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. చిత్ర దర్శకుడు మారుతి పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ‘ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ ఏఐ (కృతిమ మేధ)తో క్రియేట్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది’ అని హోస్ట్‌ ప్రస్తావించగా నిర్మాత ఖండించారు. 2022 నవంబరులో సంబంధిత లుక్‌ను షూట్‌ చేసినట్లు తెలిపారు. హీరో పాత్ర తీరు, గెటప్‌ గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడం కష్టమన్నారు.

ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ‘రాజాసాబ్‌’లో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్‌’లో పొడవాటి జుట్టుతో రవితేజ కొత్తగా కనిపించనున్నారు. కావ్యా థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రధారులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని