Updated : 26 Jun 2022 07:16 IST

Bollywood: వెండితెరే మైదానం ఆటగాళ్లే కథనం

మునివేళ్లపై నిల్చోబెట్టేంత ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టించేంత సెంటిమెంట్‌... మనసారా నవ్వేంత వినోదం.... ఇలా క్రీడాకారుల బయోపిక్‌లలో భావోద్వేగాలకు కొరతే ఉండదు! పైగా స్టార్‌ ఆటగాళ్ల సినిమా అంటే ప్రేక్షకుల్లో బోలెడంత ఆసక్తి. అందుకే మరి.. ఈ బయోపిక్‌లు సినీ జనాలకు ఎప్పుడూ హాట్‌ ఫేవరెట్‌లే. గతంలో ఎందరో క్రీడాకారుల జీవితం తెరకెక్కినా.. ఇప్పుడూ బాలీవుడ్‌లో చాలానే వరుసలో ఉన్నాయి. అవేంటో చూద్దామా!

‘దాదా’కు గ్రీన్‌సిగ్నల్‌

2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానంలో భారత్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించగానే, చొక్కా విప్పి గిరాగిరా తిప్పుతూ పౌరుషం ప్రదర్శించిన సౌరవ్‌ గంగూలీని(Ganguly) ఇప్పటికీ చాలామంది మర్చిపోరు. తన ప్రోత్సాహంతో ఎందరో మెరికల్లాంటి ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాడు దాదా. ఆటలోనూ మొనగాడైన దాదా ‘లవ్‌ రంజన్‌ ఫిల్మ్స్‌’(Love Ranjan Films) అనే సంస్థకు తన బయోపిక్‌ నిర్మించడానికి అనుమతినిచ్చాడు. ఏడాది కిందట స్వయంగా గంగూలీనే ఈ విషయంపై ట్వీట్‌ చేశాడు. ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలకెక్కని ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) గంగూలీ పాత్ర పోషిస్తుండగా, శ్రద్ధా కపూర్‌(Shraddha Kapoor) కథానాయికగా నటిస్తుందని సమాచారం.


మిథాలీగా మెప్పిస్తానంటూ

మిథాలీ దొరై రాజ్‌(Mithali raj) భారత మహిళా క్రికెటర్లలో దిగ్గజం. 23 ఏళ్ల కెరీర్‌, లెక్కలేనన్ని రికార్డులు.. ఆటలో అమ్మాయిలకు ఒక స్ఫూర్తిలా మారిన మిథాలీ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’గా(Shabaash Mithu) రానుంది. తాప్సీ పన్ను(Taapsee Pannu) మిథాలీలా మెప్పిస్తానంటోంది. రాహుల్‌ ఢోలాకియా ఈ జీవిత చరిత్రను తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా కోసం తాప్సీ ఆరునెలల పాటు క్రికెట్‌లో శిక్షణ తీసుకుంది. జులై 15న విడుదల అవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఇప్పటికే జనం ముందుకొచ్చి ఆకట్టుకుంటోంది. దీనికి శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు.


షాహిద్‌ పంచ్‌

భారత్‌లో మహిళా బాక్సింగ్‌కి ఒక ఊపు తెచ్చిన వనిత మేరీకోమ్‌(Mary Kom). ఆమెలో స్ఫూర్తి నింపింది ఎవరు? అంటే చెప్పే పేరు డింకో సింగ్‌(Dingko Singh). 1988 ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన దిగ్గజ బాక్సర్‌ 42 ఏళ్లకే కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశాడు. పుట్టెడు కష్టాల్లోంచి వచ్చి రింగ్‌లో కింగ్‌లా మారిన డింకో బయోపిక్‌లో షాహిద్‌కపూర్‌(Shahid Kapoor) నటిస్తున్నాడు. రాజా కృష్ణమీనన్‌(Raja Krishna Menon) దర్శకుడు. ‘బ్లడీ డాడీ’ పూర్తవగానే స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు షాహిద్‌.


షూట్‌ చేస్తానంటున్న హర్ష్‌వర్ధన్‌

ఒలింపిక్స్‌లో దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన మేటి షూటర్‌ అభినవ్‌ బింద్రా(Abhinav Bindra). షూటర్‌గా మారాలనే కల నుంచి.. స్వప్నం సాకారమైన వేళ దాకా అతడి జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఈ వివరాలన్నీ ‘ఏ షాట్‌ ఎట్‌ హిస్టరీ: మై ఆబ్సెసివ్‌ జర్నీ టు ఒలింపిక్‌ గోల్డ్‌ అండ్‌ బియాండ్‌’లో స్వయంగా రాసుకున్నాడు అభినవ్‌ బింద్రా. ఈ ఆటోబయోగ్రఫీ ఆధారంగా సినిమా రానుంది. అనిల్‌కపూర్‌ తనయుడు హర్ష్‌వర్ధన్‌ కపూర్‌(Harshvardhan Kapoor) ఈ బయోపిక్‌లో నటిస్తున్నాడు. కన్నన్‌ అయ్యర్‌(Kannan Ayyar) దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబంధించి త్వరలోనే షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ మొదలవుతుందని అనిల్‌కపూర్‌(Anil Kapoor) ప్రకటించారు.


జులన్‌ గోస్వామిగా అనుష్క

భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి(Jhulan Goswami). భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన జులన్‌ క్రీడాకారిణిగా ఎంత విజయవంతమైందో.. తన జీవితం వెనక అన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయి. అమ్మాయిగా వివక్ష ఎదుర్కొని, కుళ్లు రాజకీయాలు దాటి మేటి క్రికెటర్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’(chakde express) రూపొందుతోంది. ఇందులో అనుష్క శర్మ(Anushka Sharma) జులన్‌ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం విరాట్‌ కోహ్లి నుంచి ఆటకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకుంటున్నాంటోంది. అభిషేక్‌ బెనర్జీ ఈ చిత్ర స్క్రిప్ట్‌ అల్లితే, ప్రోసిత్‌ రాయ్‌ ఈ బయోపిక్‌కని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2023 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని