
RRR: ఒక్క సీన్‌కి రూ. 75 లక్షలు.. ఎన్టీఆర్‌ని అలా చూపిస్తే ఊరుకుంటారా: రాజమౌళి
కలెక్టరేట్ (శ్రీకాకుళం): ‘విజయం కావాలంటే తగిన ప్రయాణం అవసరమని నమ్ముతాను. ఏ కథ అయినా నన్ను బాగా ప్రేరేపించాలి. అప్పుడే దాన్ని తెరకెక్కిస్తా’ అని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలిపారు. వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై వ్యక్తిగత, సినీ విశేషాల్ని పంచుకున్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నతంగా ఆలోచించాలని, ఏ పనైనా నిబద్ధతతో చేస్తేనే అనుకున్నది సాధించగలమని విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అవేంటో చదివేయండి..
* దర్శకుడు కాకపోయి ఉంటే ఏమయ్యేవారు?
రాజమౌళి: నాకు డ్రైవింగ్ వచ్చు. ఒకవేళ దర్శకుడ్ని కాకపోయి ఉంటే డ్రైవరే అయ్యేవాడినేమో!
* మీరు ఈ స్థాయికి వస్తారని ముందే ఊహించగలిగారా?
రాజమౌళి: ఊహించా. ‘శాంతినివాసం’ (ధారావాహిక) చేస్తున్న సమయంలోనే పదేళ్ల తర్వాత కచ్చితంగా పెద్ద దర్శకుడిని అవుతానని అనిపించింది.
* సినీ పరిశ్రమలో మీరే ఎక్కువగా విజయాలు అందుకుంటున్నారు? అందుకు కారణమేంటి?
రాజమౌళి: విజయం కావాలంటే తగిన ప్రయాణం అవసరమని నమ్ముతాను. ఏ కథ అయినా నన్ను ప్రేమించాలి. అప్పుడే దాన్ని తెరకెక్కిస్తా. ఈ ప్రయాణమే విజయాల్ని అందిస్తుందనుకుంటా.
* ఎందరో దర్శకులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. మరి మీకు స్ఫూర్తినిచ్చిందెవరు?
రాజమౌళి: ఒక్కో సమయంలో ఒక్కో దర్శకుడు నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ముఖ్యంగా నా సృజనాత్మకతని బయటకి తీసుకొచ్చేలా చేసింది మెల్ గిబ్సన్ (‘బ్రేవ్ హార్ట్’ దర్శకుడు- హాలీవుడ్). ఆయన విజన్, టేకింగ్ స్టైల్ అంటే నాకు బాగా ఇష్టం. ‘పవన్ కల్యాణ్’ అని అనగానే ఇంతకు ముందు మీరు అరిచారు కదా! మెల్ గిబ్సన్ పేరు చెబితే నేను అంతకు పది రెట్లు గట్టిగా అరుస్తా. ఆఫ్ స్క్రీన్.. రామ్‌గోపాల్ వర్మ అంటే ఇష్టం.
* చిన్నపిల్లలు చూసే చిత్రాలు తీస్తారా?
రాజమౌళి: ‘బాహుబలి’.. అంత పెద్ద హిట్ కావడానికి ఓ కారణం చిన్నపిల్లలూ చూడటమే. పెద్దవారితోపాటు చిన్నపిల్లలూ చూసే సినిమాలు తీయాలనేది నా కోరిక. అలానే తీస్తున్నానని అనుకుంటున్నా.
* ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ 30 నిమిషాలే కనిపిస్తారట? నిజమేనా?
రాజమౌళి: జూనియర్ ఎన్టీఆర్‌ను 30 నిమిషాలే చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా..! ఇంతకుమించి ఏం చెప్పలేను.
* మీ కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ ఎప్పుడు ప్రారంభిస్తారు?
రాజమౌళి: ‘మహాభారతం’ తెరకెక్కించాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అవసరం. నా ప్రతి సినిమాలోనూ సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మనసులో ఉన్న విజువల్స్‌ని తెరపై చూపించగలననే విశ్వాసం వచ్చినప్పుడు ఆ సినిమా మొదలుపెడతాను.
* పవన్ కల్యాణ్‌తో సినిమా ఎప్పుడు తీస్తారు?
రాజమౌళి: పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలని ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఆయన్ను షూటింగ్లో ఒకసారి కలిశాను. సమయం ఇస్తే కథ చెబుతా అన్నాను. అలా ఏడాదిన్నర కాలం గడిచింది. ఆయన నుంచి ఎలాంటి కబురు రాలేదు. తర్వాత నా ఆలోచన మారింది. మాస్ తరహా సినిమాలు కాదు ఎక్కువ మందికి చేరువయ్యే భారీ ప్రాజెక్టులు తీయాలనిపించింది. అలా ‘మగధీర’, ‘యమదొంగ’ వంటి చిత్రాలు వచ్చాయి. అదే సమయంలో ఆయన రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇద్దరి దారులు వేరయ్యాయి. ఆయన్ను ఎప్పుడూ గౌరవిస్తా.
* మహేశ్‌బాబుతో మీరు చేయనున్న ప్రాజెక్టు వివరాలు?
రాజమౌళి: ఇప్పుడేం చెప్పలేను.
* అన్ని దేశాల్లోనూ ఎంత పెద్ద సినిమానైనా 6 నెలల్లోపు పూర్తి చేస్తున్నారు. అలాంటిది మీరు 2-5 ఏళ్లు వెచ్చించడానికి కారణమేంటి?
రాజమౌళి: ఆరు నెలల్లో ఎవరూ తీయరు. పూరి జగన్నాథ్ గారిని వదిలేయండి. ఆయన మహానుభావుడు. అంత తక్కువ సమయంలో ఆయన ఎలా తీస్తాడో నాకు తెలియదు. ఆరు నెలల్లో సినిమా తీయడమనేది అసాధారణం. షూటింగ్ తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ఆలస్యమవుతుంది. హాలీవుడ్‌లోనైనా సరే భారీ ప్రాజెక్టులకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం పడుతుంది.
* సినిమా చిత్రీకరణకి సంబంధించి షెడ్యూల్ ఆలస్యమైతే ఎలా ఫీలవుతారు?
రాజమౌళి: ఆ సమయంలో డబ్బుల గురించే ఆలోచిస్తాను. ఎందుకంటే షెడ్యూల్ ఆలస్యమవుతుంటే నిర్మాతకి నష్టం వస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ విషయానికొస్తే రాత్రిపూట చిత్రీకరించే ఒక్క సీన్‌కే రూ. 75 లక్షలు ఖర్చవుతుంది. చిత్ర బృందం కారణంగా ఏదైనా తప్పు జరిగినా, వాతావరణం అనుకూలించక పోయినా ఖర్చంతా వృథానే.
* దర్శకుడు సుకుమార్ టేకింగ్ అంటే ఇష్టమని, తను మీకు పోటీ అని పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అప్‌కమింగ్ దర్శకుల్లో అలా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందెవరు?
రాజమౌళి: సందీప్ రెడ్డి వంగా (‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు).
ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు?
రాజమౌళి: ఒక్కో సమయంలో ఒక్కొక్కరు. సినిమాలు, నటన గురించి మాట్లాడాలంటే నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కాలక్షేపం చేస్తా. నాకు జంతువులంటే ప్రేమ. వాటి గురించి మాట్లాడాలంటే రామ్ చరణ్‌తో, ఆహారం గురించి అయితే ప్రభాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తా.
ప్రభాస్‌తో మరో చిత్రం తీసే అవకాశం ఉందా?
రాజమౌళి: ఇటీవల ఆయన తన ప్రాజెక్టులు ప్రకటించారు. ఎన్ని ఉన్నాయో చూశారు కదా! నాకు అవకాశం ఎప్పుడొస్తుంది?
మీకు బాగా ఇష్టమైన కర్ణుడి పాత్రని పోషించే అవకాశం ఎవరికిస్తారు?
రాజమౌళి: ఆ అవకాశం ప్రభాస్‌కి ఇస్తా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.