Puri Musings: బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్‌

పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్‌’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్‌

Published : 24 Apr 2024 00:12 IST

హైదరాబాద్‌: మన మెదడు పెద్ద దెయ్యమని, అందులో నిరంతరం ఆలోచనల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని దాన్ని అదుపు చేయాలని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అన్నారు. వివిధ అంశాలపై ‘పూరి మ్యూజింగ్స్‌’ అంటూ తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ది డెవిల్‌’ పేరుతో మెదడు, దాని ఆలోచన తీరుపై మాట్లాడారు.

‘‘ఎవడో మనకు వార్నింగ్‌ ఇస్తాడు. ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో అవే ఆలోచనలు మన మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. మనల్ని ఎలా చంపుతాడోనని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ముందే పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తే మంచిదనుకుంటాం. నిద్ర పోయే ముందు ప్రతీ తలుపునకు తాళం వేస్తాం. ఒకవేళ వాడు ఈ రాత్రి రాలేదంటే, రేపు వస్తాడేమోనని ఎదురుచూస్తాం. స్కూటర్‌ మీద వెళ్లకపోవడం బెటరనుకుంటాం. ఎందుకంటే మన బండి నంబర్‌ రౌడీలకు ఇచ్చి దాడి చేయిస్తాడేమోనని ఆలోచిస్తాం. విషం కలుపుతాడేమోనని పిజ్జా ఆర్డర్‌ చేయటం కూడా మానేస్తాం. పది రోజులైనా మనల్ని చంపడానికి ఎవరూ రాకపోతే, ఇంకేదో మాస్టర్‌ ప్లాన్‌ వేశాడని అనుకుంటాం. ‘నిజంగా నన్ను చంపేస్తాడా? నేను చచ్చిపోతే నా పెళ్లాం-పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లు రోడ్డుపై అడుక్కుతింటారు. అలా జరగకూడదు. జరగనివ్వను. వాడు చంపేవరకు ఎందుకు? నేనే వాడిని చంపేస్తా’ అని చాలామంది తీర్మానానికి వచ్చేస్తారు. ఈ ఐడియా బాగా నచ్చుతుంది. ఆ రాత్రి వాడి ఇంటికి వెళ్లి గొడ్డలితో నరికేస్తారు. ఇక జీవితాంతం జైల్లో గడుపుతారు. వీటన్నింటికీ కారణం మన ఆలోచనలు’’

‘‘మన బ్రెయిన్‌ పెద్ద దెయ్యం. దానికున్న పెద్ద క్వాలిటీ ఆర్ట్‌ ఆఫ్‌ ఓవర్‌ థింకింగ్‌. అనుక్షణం మన మెదడులో ఏవేవో ఆలోచనలు కుప్పలుతెప్పలుగా వచ్చేస్తాయి. సడెన్‌గా స్కూల్‌ డేస్‌ గుర్తుకువస్తాయి. రైల్లో చూసిన బెంగాలీ అమ్మాయి కనిపిస్తుంది. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. చిన్నప్పుడు చూసిన అమితాబ్‌ మూవీ.. ఇలా అంతులేని ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. ఒకరోజులో దాదాపు 60వేల ఆలోచనలు వస్తాయట. అందులో 95శాతం నెగెటివ్‌ థాట్స్‌. మన మైండ్‌ పెద్ద ఫియర్‌ ఫ్యాక్టరీ. అనుక్షణం భయాలను పుట్టిస్తూ ఉంటుంది. మైండ్‌ చెప్పేవి అస్సలు వినొద్దు. అవన్నీ సీరియస్‌గా తీసుకోవద్దు. లేదంటే పిరికివాళ్లమైపోతాం. అందుకే ధ్యానం చేయాలి. కానీ, మనకు ఆ సమయం ఉండదు. లోపల ఉన్న దెయ్యాన్ని భయపెట్టడం నేర్చుకోండి. ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మనశ్శాంతిగా ఉండండి’’ అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.

వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని