Tollywood Upcoming Movies: ‘సలార్‌’ వాయిదా.. ఆ డేట్‌కి ఎన్ని సినిమాలు వస్తున్నాయంటే?

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి 2’ విడుదల వాయిదా పడింది. సెప్టెంబరు 28న ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ‘సలార్‌’ వాయిదా పడిన నేపథ్యంలో సెప్టెంబరు 28న రిలీజ్‌ కానున్న ఇతర సినిమాలేవంటే?

Published : 08 Sep 2023 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రభాస్‌ (Prabhas) నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్‌’ (Salaar: Ceasefire) సెప్టెంబరు 28న థియేటర్లలో సందడి చేసేది. కానీ, అలా జరిగే పరిస్థితి కనిపించడంలేదు. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమా వాయిదా పడినట్లే అని సమాచారం. దాంతో, ఇతర సినిమాల దర్శక, నిర్మాతలు ఆ డేట్‌నే లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబరు 28 (September 28th) కంటే ముందుగానే విడుదల చేయాలనుకున్న తమ చిత్రాలను కొందరు ఇప్పుడు అదే తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సెలవు రోజులు కలిసొచ్చే అవకాశం ఉండటంతో ఆ దిశగా ప్రయత్నం చేశారు. ఇంతకీ, అవే సినిమాలు? దర్శకులెవరంటే?

సెప్టెంబరు రెండో వారంలో రావాల్సింది..

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), నేహాశెట్టి (Neha Shetty) జంటగా దర్శకుడు రత్నం కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan). దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలు. ప్రేమ, హాస్యం ప్రధానంగా రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు రెండో వారంలో విడుదల చేయాలనుకున్నారు. ‘సలార్‌’ వాయిదా పడుతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దర్శక, నిర్మాతలు చర్చించుకుని తమ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబరు 28న విడుదలవుతుందనే ప్రకటనతో ‘సలార్‌’ వాయిదా పడినట్లు ఓ స్పష్టత వచ్చింది.

చాలారోజుల తర్వాత ఇలా.. సరికొత్త చిత్రాలపై రాజమౌళి రివ్యూ..!

ఈ రెండు ఇలా..

రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్కంద’ (Skanda). శ్రీలీల (Sree Leela) కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబరు 15న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. తర్వాత, ‘సలార్‌’ వాయిదాని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 28కి మార్చారు. మరోవైపు, ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)ని ఈ నెల 15న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన లైకా ప్రొడక్షన్స్‌.. తాజాగా డేట్‌ని మార్చింది. కొత్త విడుదల తేదీగా సెప్టెంబరు 28ని ఫిక్స్‌ చేసింది. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ వర్క్‌ ఆలస్యమవడం వల్ల సినిమాని వాయిదాని వేసినట్లు ఆ సంస్థ తెలిపింది. రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence), కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి పి. వాసు దర్శకుడు.

‘మ్యాడ్‌’ కూడా అప్పుడే

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్‌’ (MAD). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కొన్ని రోజుల క్రితమే టైటిల్‌ని ప్రకటించిన చిత్ర బృందం విడుదల తేదీని ఖరారు చేసింది. సెప్టెంబరు 28న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపింది.


ఆగస్టు 18 అన్నారు కానీ,

రాజకీయ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెదకాపు’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాతో విరాట్‌ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ముందుగా ఈ సినిమా తొలి భాగాన్ని (Peda Kapu-1) ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు నిర్మాత రవీందర్‌ రెడ్డి ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల సెప్టెంబరు 29కి వాయిదా వేశారు.


‘టిల్లు స్క్వేర్‌’ ఇంకా ఆలస్యం..

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రమిది. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 15న విడుదల కావాల్సిన ఈ సినిమాని కొన్ని రోజుల క్రితమే వాయిదా వేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత తెలిపారు. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని