kalki movie review: రివ్యూ: కల్కి.. టొవినో థామస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

మలయాళంలో మంచి టాక్‌ సొంతం చేసుకున్న టొవినో థామస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి’ మెప్పించిందా?

Updated : 25 Jun 2024 16:23 IST

Kalki movie review; చిత్రం: కల్కి; నటీనటులు: టొవినో థామస్‌, సైజు కురుప్‌, శివజిత్‌ పద్మనాభన్‌, సుదీష్‌, అపర్ణ నాయర్‌, అనీష్‌ గోపాల్‌, సంయుక్త తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; ఎడిటింగ్‌: రంజిత్‌ కుజూర్‌; సినిమాటోగ్రఫీ: గౌతమ్‌ శంకర్‌; నిర్మాత: సువిన్‌ కె. వర్కే, ప్రశోబ్‌ కృష్ణ; దర్శకత్వం: ప్రవీణ్‌ ప్రభారం; స్ట్రీమింగ్‌ వేదిక: ఈటీవీ విన్‌

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికగా ఆస్వాదిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న యాక్షన్‌ చిత్రం ‘కల్కి’. టొవినో థామస్‌ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి పోలీస్‌ ఆఫీసర్‌గా టొవినో థామస్‌ ఎలా నటించారు?(Kalki movie review) దేనిపై ఆయన పోరాటం చేశారు?

కథేంటంటే: ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో ఉన్న నంచెన్‌ కోట ప్రాంతంలో రాజకీయ నాయకుడు అమరనాథ్‌ (శివజిత్‌ పద్మనాభన్‌) చెప్పిందే వేదం. ఎవరైనా అతని మాటకు అడ్డు చెబితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. తన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకునేందుకు కొందరు అమాయక ప్రజలను అక్కడినుంచి తరిమికొడతాడు. దీంతో వాళ్లు దిక్కులేక ఊరి చివర గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇదేం దౌర్జన్యమని ప్రశ్నించిన ప్రత్యర్థి పార్టీ నాయకుడిని కూడా సభలోనే దారుణంగా హత్య చేయిస్తాడు. ఆ ఊళ్లో పోలీస్‌స్టేషన్‌ ఉన్నా, అమర్‌నాథ్ అరాచకాలకు భయపడి ఏమీ చేయలేని పరిస్థితి. ఊరి ప్రజలకు న్యాయం చేయలేకపోయాననే బాధతో ఎస్సై విశాఖన్‌ (ఇర్షద్‌) స్టేషన్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆ ఊరికి కొత్త ఎస్సై కల్కి (టొవినో థామస్‌) వస్తాడు. అతను వచ్చిన దగ్గరినుంచే అమరనాథ్‌, అతడి మనుషులను పరుగులు పెట్టిస్తాడు. మరి కల్కిపై కోపంతో అమరనాథ్‌ చేసిన దుశ్చర్యలు ఏంటి? వాటిని కల్కి ఎలా అడ్డుకున్నాడు? (Kalki movie review) ఈ క్రమంలో కల్కి ఎవరెవరిని కోల్పోయాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే:  పదవి, అధికారం, డబ్బు కోసం కొందరు దుర్మార్గులు ప్రజలను పట్టి పీడించడం తమకు ఎదురువచ్చిన వారిని బెదిరించడం, లొంగకపోతే దారుణంగా హత్య చేయడం. అదే సమయంలో నిజాయతీ కలిగిన పోలీస్‌ అక్కడి వచ్చి, ప్రజలకు అండగా నిలబడి, ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పడం ఈ ఫార్మాట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. టొవినో థామస్‌ ‘కల్కి’ అందుకు భిన్నమైనదేమీ కాదు. నంచన్‌ కోటను అమర్‌నాథ్‌ అతడి కుటుంబం తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చేసే అరాచకాలు, దుర్మార్గాలతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అమర్‌నాథ్‌ ఆగడాలు భరించలేక ఎస్సై విశాఖ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఎస్సైగా కల్కి రావడం, వచ్చి రాగానే అమర్‌నాథ్ మనుషులపై విరుకుపడే సన్నివేశాలు మాస్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. అక్కడినుంచి నంచన్‌కోటలో కల్కి హవా నడుస్తుంది. రాజకీయ నాయకుల అండతో ఎదిగిన రౌడీలను ఎరిపారేస్తూ సాగే కల్కి ప్రయాణం ఆసక్తిగా ఉంటుంది. (Kalki movie review) అమర్‌నాథ్‌కు కుడి భుజం లాంటి ఉమర్‌ (హరీశ్‌ ఉత్తమన్‌)ను చావగొట్టి రెండు కాళ్లూ తీసేసే సీన్‌ హీరోయిజాన్ని ఓ స్థాయిలో ఎలివేట్‌ చేశాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో కల్కి పాత్ర మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించాడు. ప్రతీ విషయంలోనూ అడ్డు తగులుతున్న కల్కిని అంతం  చేసే క్రమంలో అమర్‌నాథ్‌ చేసే దారుణాలు మరింత క్రూరంగా ఉంటాయి. కల్కి తన ప్రియమైన వారిని కోల్పోయే సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. సినిమా ముందుకుసాగే కొద్దీ పూర్తి రివేంజ్‌ డ్రామాగా నడుస్తుంది. ఒక రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ను ముగించాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే: మలయాళ అనువాద చిత్రాల ద్వారా నటుడు టొవిన్‌ థామస్‌ ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం. ఎస్సై కల్కిగా ఆయన నటన ఆద్యంతం సీరియస్‌గా సాగుతుంది. మిగిలిన పాత్రలేవీ తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు. దర్శకుడు ప్రవీణ్‌ ప్రభారమ్‌ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. ఈ ఫార్మాట్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. అందులో ఇదీ ఒకటిలా ఉంటుందే తప్ప, భిన్నంగా ఏమీ లేదు. అయితే, కల్కి పాత్రను చూపించిన తీరు, యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం మాస్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి కచ్చితంగా టైమ్‌పాస్‌.

  • బలాలు
  • + టొవినోథామస్‌ నటన
  • + యాక్షన్‌ సీన్స్‌
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ, కథనాలు
  • - పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం
  • చివరిగా: కల్కి.. యాక్షన్‌ ప్యాక్డ్‌మూవీ (Kalki movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని