Kriti Sanon: నేషనల్‌ అవార్డ్ విన్నర్స్‌.. అల్లు అర్జున్‌, కృతి సనన్‌ కలిసి నటిస్తారా?

జాతీయ అవార్డుల విజేతలు అల్లు అర్జున్‌, కృతి సనన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఒకరికొకరు అభినందించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది.

Published : 28 Aug 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌ (Allu Arjun), ‘మిమీ’ (Mimi) చిత్రంలోని నటనకుగాను కృతిసనన్‌ (Kriti Sanon) జాతీయ అవార్డుకు (69th National Awards) ఎంపికైన సంగతి తెలిసిందే. మరి, ఈ ఇద్దరు కలిసి నటిస్తారా..? ఇప్పుడిదే ప్రశ్న తెరపైకి వచ్చింది. కృతి సనన్‌ పెట్టిన ట్వీట్‌ ఇందుకు కారణమైంది. ఇతర కేటగిరీల్లో విజేతలుగా నిలిచినవారితోపాటు ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కృతిసనన్‌, అలియా భట్‌లకు అల్లు అర్జున్‌.. ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఇటీవల అభినందనలు తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్‌కు కృతి కృతజ్ఞతలు చెప్పారు. ‘మీక్కూడా కంగ్రాట్స్‌. మీ నటనకు నేను అభిమానిని. ‘పుష్ప’లో అద్భుతంగా నటించారు’ అని కితాబిచ్చారు. దానికి అల్లు అర్జున్‌ స్పందిస్తూ థ్యాంక్స్‌ చెప్పారు. భవిష్యత్తులోనూ మిమ్మల్ని ఇలానే అలరిస్తానని ఆశిస్తున్నా అని అన్నారు. ఈ ట్వీట్‌కు కృతి సనన్‌ తాజాగా రిప్లై ఇస్తూ.. మనిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. తన ఫేవరెట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు. దాంతో, ‘తదుపరి సినిమాలో హీరోయిన్‌గా కృతిని ఎంపిక చేయ్‌ అన్నా’ అంటూ కొందరు, ‘ఈ కాంబినేషన్‌ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈ నేషనల్‌ అవార్డ్‌ వినర్స్‌ ఎప్పుడు కలిసి నటిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌.. ఫైర్‌

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో కృతిసనన్‌ తెరంగేట్రం చేశారు. నాగచైతన్య సరసన ‘దోచేయ్‌’లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయ్యారు. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘ఆదిపురుష్‌’తో చాలాకాలానికి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. అల్లు అర్జున్‌ విషయానికొస్తే.. నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్‌’ సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’తో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని