Allu Arjun: నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌.. ఫైర్‌

‘ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు... విజయం కూడా అలాంటిదే’- అల్లు అర్జున్‌ తన కార్యాలయంలో స్వయంగా రాసుకున్న సూక్తి ఇది. ఆయన ప్రయాణానికి అద్దం పట్టే మాట ఇది.

Updated : 27 Aug 2023 20:28 IST

జాతీయ పురస్కారంతో అందరూ గర్వపడుతున్నారు
ఉత్తరాది నుంచే ఎక్కువ పోటీ

నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌.. ఫైర్‌. నాకు జాతీయ అవార్డు రావడానికి కారణమైన సుకుమార్‌ అన్న మాట ఇది

అల్లు అర్జున్‌


‘ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు... విజయం కూడా అలాంటిదే’

- అల్లు అర్జున్‌ తన కార్యాలయంలో స్వయంగా రాసుకున్న సూక్తి ఇది. ఆయన ప్రయాణానికి అద్దం పట్టే మాట ఇది. తొలి సినిమా ‘గంగోత్రి’ తర్వాత ఆయన లుక్స్‌, నటనపై ఎన్నెన్నో అభిప్రాయాలు. అందరూ ఆ ఒక్క సినిమానే చూశారు, కానీ ఆయన పర్వతం స్థాయి ఎదుగుదలనే చూశారు. అందుకు తగ్గట్టే ఒకొక్క సినిమాతో తనని తాను తీర్చిదిద్దుకున్నారు. తెలుగులో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతని సాధించారు. ‘పుష్ప’లో నటనకిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు అల్లు అర్జున్‌. 69 ఏళ్ల పురస్కార చరిత్రలో తెలుగులో ఈ పురస్కారం సాధించిన తొలి నటుడు అల్లు అర్జున్‌. ఇరవయ్యేళ్ల కెరీర్‌లో ఎత్తు పల్లాలెన్నో చూసిన ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇటీవలే జాతీయ పురస్కారం గెలిచిన అల్లు అర్జున్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.


అవార్డు ప్రకటనకు ముందే సామాజిక మాధ్యమాల్లో మీకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మీకు పురస్కారం ఖాయమని మీ అభిమానుల్లో అంత నమ్మకం కనిపించింది. మరి మీ అంచనాలు ఎలా ఉండేవి?

నా అభిమానుల్లో కానీ, సగటు సినీ ప్రేమికుల్లో కానీ...  అంత నమ్మకం ఉండటానికి కారణం ఒక్కటే. ఆ ఏడాదికి సంబంధించి చాలా పురస్కారాల్లో మేమే ముందున్నాం. మా సినిమాకి అత్యధిక వసూళ్లు వచ్చాయి. నటన పెద్ద పాత్ర పోషించింది. అలా ఏ రకంగా చూసినా మాకు అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో నాకు రాకపోవచ్చనే సందేహం కూడా ఉండేది. సినిమా అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. పుష్ప పాత్ర కూడా ఓ స్మగ్లర్‌. అలా కొన్నిసార్లు సినిమా నేపథ్యం కూడా సహకరించకపోవచ్చు. అందుకే ఏమైనా జరగొచ్చు అనుకున్నా. కానీ వచ్చే అవకాశాలు ఎక్కువనే నమ్మా. 

స్మగ్లర్‌ పాత్రకి పురస్కారమా అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అవి మీదాకా వచ్చాయా?

ఉత్తమ నటుడు పురస్కారం నాణ్యమైన నటనే ప్రామాణికంగా భావించి ఇస్తారు. ఆస్కార్‌ పురస్కారాలకి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యం ఉంది. అక్కడ కూడా నటనే ప్రామాణికం తప్ప, పాత్ర కాదు. పుష్ప పాత్ర స్మగ్లరే కావొచ్చు, కానీ అందులో నటననే చూడాలి. ఉత్తమ చిత్రం విభాగానికైతే నామినేషన్‌ కూడా వేయొద్దని మా బృందానికి చెప్పా. ‘అగ్నిపథ్‌’ సినిమాలో అమితాబ్‌ డాన్‌ తరహా పాత్రనే పోషించారు. ఆ సినిమాకిగానూ ఆయన ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు.

పురస్కారం మీకే అని తెలిసిన ఆ క్షణం మీలో కలిగిన అనుభూతిని పంచుకుంటారా?

మేం చాలా విభాగాల కోసం నామినేషన్లు వేశాం. ఎవరెవరికి పురస్కారం వస్తుందో అనే ఆత్రుత ముందు నుంచీ ఉండేది. అందుకే దర్శకుడు, నిర్మాతలు అందరూ ఒకే చోట చేరి టీవీ ముందు కూర్చున్నాం. ఉత్తమ నటుడు విభాగంలో నా పేరు తెరపై కనిపించగానే ఆనందంతో సుకుమార్‌ని గట్టిగా హత్తుకున్నా. ఈ పురస్కారం రావడానికి వంద కారణాలు ఉంటే, అవన్నీ సుకుమార్‌కే ఇస్తా. ఉత్తమ నటుడు పురస్కారం నాకు రావాలని నా కంటే వంద రెట్లు ఎక్కువ తను కోరుకున్నాడు. ఇది నా పురస్కారం కంటే తనకి వచ్చిన పురస్కారం అనుకోవాలి. నేను కేవలం మాధ్య మంలా పనిచేశా. నేనొక వైర్‌ అయితే అందులో కరెంట్‌ నువ్వే అని తనతో చెప్పా. ‘నువ్వు వైర్‌ కాదు డార్లింగ్‌... ఫైర్‌’ అన్నాడు సుకుమార్‌ (నవ్వుతూ).

69 ఏళ్ల పురస్కార చరిత్రలో... ఎవరికీ సాధ్యం కాని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం తెలుగు నుంచి మీరు సాధించారు. ఇది మరింత ప్రత్యేకం కదా? 

తొలి పురస్కారం నేనే సాధించానని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, అంతే షాక్‌ అయ్యా. ఇదివరకు వచ్చిందేమో, నేను మూడోవాణ్నో, నాలుగోవాణ్నో అనుకున్నా. కానీ టీవీలో నాకే తొలిసారి అని తెలిశాక ఆశ్చర్యపోయా. నేనేదో మిగతా వాళ్లకంటే గొప్ప అని కాదు. గొప్ప గొప్ప నటులున్నా ఎందుకో కుదరలేదు. ఆ పరిస్థితులు, ఆ సమయం ఎలాంటిదో తెలియదు కదా.

తొలిసారి ‘పుష్ప’ కథ విన్నప్పుడు కానీ... నటిస్తున్నప్పుడు కానీ పురస్కారాల కోణంలో ఆలోచించారా? 

ఈ కథని సరిగ్గా చేస్తే అటు వాణిజ్యపరంగా... ఇటు పురస్కారాల పరంగానూ రెండు వైపులా కొట్టొచ్చని వంద శాతం నమ్మా. సుకుమార్‌ ఈ కథని తీర్చిదిద్దిన విధానంలోనే ఆ విషయం తెలుస్తుంది. ఈ సినిమాకిగానూ దేవిశ్రీప్రసాద్‌కీ పురస్కారం రావడం చాలా ఆనందాన్నిచ్చింది. మరిన్ని విభాగాల్లో పురస్కారాలకి అర్హత ఉన్న సినిమా ఇది.

తొలి సినిమాలో మీరు కనిపించిన విధానంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఇరవయ్యేళ్ల ప్రయాణం తర్వాత చూస్తే నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రయాణంపై ఏం చెబుతారు?

నన్నెక్కువమంది ఇష్టపడేది ప్రతి సినిమాకీ నేను ఎదుగుతున్న విధానాన్ని చూసే. ఆ తర్వాతే నా డ్యాన్స్‌, నా ఫైట్లు, నా పాటలు. తొలి సినిమా నుంచీ నేను ఆలోచించేదంతా మరింత ఉత్తమంగా పనిచేయడం గురించే. ఇది చాలు అని కాకుండా... ఇది కాదు అనుకుంటూనే ప్రయాణం చేస్తా. ఈ పురస్కారం రాకపోయినా సరే, తర్వాత సినిమాకి బెటర్‌మెంట్‌ కోసం ఏమేం చేయాలో అది చేస్తా. పురస్కారం వచ్చినా రాకపోయినా బాధ్యతగా, మరింత ఉత్తమంగా పనిచేయడమే నాకు తెలుసు. ఈసారి జాతీయ పురస్కారం రావడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. నాఅభిమానులే నా బలం, వాళ్లే నా బలగం. ఇంత దూరం వచ్చానంటే వాళ్లే కారణం. వాళ్ల సంతృప్తి కోసమే ఇంకా పైకి ఎదగాలనే తపన.

తెలుగు సినిమాకి ఈసారి 11 పురస్కారాలు రావడంపై ఓ నటుడిగా మీ అనుభూతి? 

ఆ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి కృతజ్ఞతలు చెబుతా. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ప్రభావం చూపింది కాబట్టి దానివల్ల కూడా జాతీయ పురస్కారాల్లో జ్యూరీ సీరియస్‌గా తీసుకుంది. జాగ్రత్తగా పరిశీలించి పురస్కారాలు ఇచ్చారు. ప్రతిసారీ మనకు దక్కే పురస్కారాలు తక్కువే. తెలుగు సినిమాల్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన ఆవశ్యకతని మన సినిమాలే చాటి చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలు ఉన్నత స్థాయిలో కొనసాగుతూ, ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. మన వాణిజ్య సినిమాల్ని ఉత్తరాదిలో ఎంతో ఇష్టపడుతున్నారు. ఓ కథానాయకుడిగా అది గర్వించే విషయం.

భవిష్యత్తులో హిందీలో సినిమాలు చేస్తారా?

రాబోయే ఐదేళ్లలో సినిమా కలయికల రూపురేఖలే మారిపోతాయి. ఇకపై భాషలతో సంబంధం లేకుండా రకరకాల కలయికలో సినిమాలు రూపొందుతాయి. బాలీవుడ్‌లో తప్పక సినిమాలు చేస్తా.

‘పుష్ప: ది రూల్‌’ ఎలా ఉంటుంది? ఆ సినిమా విశేషాలేమిటి?

అస్సలు తగ్గేదేలే.. అనే స్థాయిలో చేస్తున్నాం.

సందీప్‌రెడ్డి వంగా, త్రివిక్రమ్‌ తదితర దర్శకులతో సినిమాల్ని ప్రకటించారు. ఆ కథలు ఎలా ఉంటాయి?

వాళ్లు రెండు మూడు ఆలోచనల్ని పంచుకున్నారు. అవి ఒక కొలిక్కి వచ్చాక వాటి గురించి చెబుతా.


అభినందనలతో తడిసి ముద్దవుతున్నారా? చిరంజీవిని కలిశారట కదా, ఆయన ఏమన్నారు?

‘ఒక నటుడికి ఉత్తమ నటుడు పురస్కారం ఎందుకు ఇవ్వాలో ఓ లిస్ట్‌ వేస్తే... అందులోని అన్ని బాక్సుల్లో నీ చెక్‌లిస్ట్‌ పడుతుంది. నువ్వు చేసిన పనికి నీకు పురస్కారం రాకపోతేనే తప్పయిపోయేది’ అన్నారు. గెటప్‌ మొదలుకొని హావభావాలు, నేను మాట్లాడిన యాస, కష్టమైన లొకేషన్లలో చిత్రీకరణ చేయడం వరకు అన్ని విషయాల్నీ గుర్తు చేసి మెచ్చుకున్నారు. ఒక కమర్షియల్‌ సినిమాలో ఇంత నటన తీసుకు రావడం కష్టమని చెప్పారు. ఆ మాటలు మరింత ఆనందాన్నిచ్చాయి. నా అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు, నేనంటే ఇష్టపడేవాళ్లు, ఇష్టపడనివాళ్లూ...ఇలా అందరిలోనూ ఈ పురస్కారం తర్వాత నాకు కనిపించిన కామన్‌ విషయం ఏమిటంటే..అందరూ గర్వపడుతున్నారు. తను సాధించాడని ప్రత్యేకమైన గౌరవం, ప్రేమని ప్రదర్శిస్తున్నారు.


మీ కార్యాలయంలో గోడలపై స్ఫూర్తివాక్యాలు, వాటి కింద మీ పేరు ఉంది. మీ ఆలోచనల నుంచి వచ్చినవేనా అవి? 

అవి నేను రాసినవే. ఖాళీ సమయాల్లో నా ఆలోచనల్ని రాసుకునే అలవాటు ఉంది. నా అనుభవాల నుంచి వచ్చిన ఆ వాక్యాలు స్ఫూర్తిదాయకంగా అనిపించడంతో గోడపై రాయించా. సినిమాల కోసం రాసే ఆలోచన మాత్రం లేదు. కాకపోతే నా భావాలు నా పాత్రల్లో కనిపిస్తూనే ఉంటాయి.


ఉత్తమ నటుడు విభాగం కోసం ఈసారి జాతీయ స్థాయిలోనే కాకుండా.. తెలుగు నుంచి కూడా గట్టి పోటీ ఎదురైంది కదా?

ఇవి జాతీయ పురస్కారాలు కాబట్టి పోటీ ప్రతి ఏడాదీ ఇలాగే ఉంటుంది. ఈసారి నామినేషన్లని పరిశీలిస్తే 20 మంది నటుల మధ్య పోటీ నీకా నాకా అన్నట్టు కనిపించింది. తెలుగు నుంచి ఇద్దరు ముగ్గురు నటులు పోటీపడ్డాం కానీ, ఉత్తరాది నుంచి ఇంకా ఎక్కువ. నా దృష్టంతా అటువైపే ఉండేది.


‘‘నన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య కన్నీళ్లు పెట్టుకుని ఎక్కువ భావోద్వేగానికి గురైంది అంటే జాతీయ పురస్కారం వచ్చిందని తెలిసిన తర్వాతే. తను సినీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. సినిమా చూసి బాగుందో, బాగోలేదో చెబుతుంది తప్ప అంత లోతుగా విశ్లేషించదు. నా సినిమా ఎంత హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా తన జీవితంలో తేడా ఏమీ ఉండదు. ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిస్తే ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుందంతే. సినిమాలపై తనేమీ సలహాలు ఇవ్వదు. నేను కూడా తనతో ఆ విషయాల్ని ఎక్కువగా చర్చించను. తనే కాదు, నేను కథల విషయంలో ఎవరిమాటా వినను, నాకు నచ్చిందే చేస్తా. నా నమ్మకం ఆధారంగానే ప్రయాణం చేస్తుంటా’’.  


‘‘నాకు జాతీయ పురస్కారం రావడంపై మా అబ్బాయి అయాన్‌ అందరికంటే సంతోషంగా ఉన్నాడు. ప్రతిసారీ వచ్చే పురస్కారం కాదు... తొలిసారి మా నాన్నకే వచ్చిందని తనకి అర్థమైంది. మా అమ్మాయి అర్హకి అంత లోతుగా తెలియదు కానీ, నాన్న ఏదో సాధించాడని మాత్రం తనకి అర్థమైంది. మా అమ్మాయి సినిమాల్లో నటించింది. మా అబ్బాయి కూడా ఆసక్తి చూపితే తప్పకుండా నటిస్తాడు’’.


ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయికి చేరారు. తర్వాత లక్ష్యం ఏమిటి?

- చెప్పాను కదండీ. ఇది కాదు, ఇంకా ఇంకా... అంతే! (నవ్వుతూ).


అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ అభినందనలు

ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని పొందిన తెలుగు సినీ కథానాయకుడు అల్లుఅర్జున్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ అవార్డు గెలిచిన తొలి తెలుగు సినీ హీరో అల్లుఅర్జున్‌’ అని ఆయన అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని