Sanatana row : చిన్న నేతల వ్యాఖ్యలతో ‘ఇండియా’ కూటమికి సంబంధం లేదు : రాఘవ్‌ చద్దా

డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఆప్‌ (AAP) నేత రాఘవ్‌ చద్దా (Raghav Chadha) ఖండించారు. చిన్న నేతలు చేసే వ్యాఖ్యలతో ‘ఇండియా’ కూటమికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. 

Published : 13 Sep 2023 02:23 IST

దిల్లీ : సనాతన ధర్మంపై డీఎంకే (DMK) నేత ఉదయనిధి (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలను ఆప్‌ (AAP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) ఖండించారు. చిన్న నేతలు చేసే వ్యాఖ్యలతో ‘ఇండియా’ కూటమికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ‘నేను సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిని. నేను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. వ్యతిరేకిస్తున్నా. ఎవరూ అలా మాట్లాడకూడదు. ఏ మతాన్ని కించపరచకూడదు. అన్ని మతాలను గౌరవించాలని’ చద్దా తెలిపారు. 

కేంద్రమంత్రికి చేదు అనుభవం.. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో బంధించిన కార్యకర్తలు!

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుందని భాజపా విమర్శించింది. ఆ కూటమి సమావేశాల్లో సనాతనాన్ని విమర్శించడం రహస్య అజెండాగా ఉందని ఆరోపించడంపై రాఘవ్‌ చద్దా స్పందించారు. ఏదో ఒక పార్టీకి చెందిన నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది కూటమి చేసినట్లుగా భావించొద్దని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడానికి కూటమి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని జిల్లాల నుంచి చిన్న నేతలు చేసే వ్యాఖ్యలను అధికారిక కూటమికి ఆపాదించడం సరికాదని చెప్పారు. 

‘ఇండియా’ కూటమి 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. అందులో రాఘవ్‌ చద్దా సభ్యుడిగా కొనసాగుతున్నారు. బుధవారం దిల్లీలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నివాసంలో ఈ కమిటీ సమావేశం కానుంది. కూటమిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిస్తామని చద్దా తెలిపారు. రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. విపక్షాల ప్రధాని అభ్యర్థి రేసులో ఆప్‌ లేదని ఈ సందర్భంగా రాఘవ్‌ చద్దా స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని