రాహుల్‌ జీ.. రక్తపుటేర్లు కాదు.. గులకరాయి విసిరే ధైర్యం కూడా ఎవరికీ లేదు: అమిత్ షా

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తే రక్తపుటేర్లు పారతాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అప్పట్లో అన్నారని.. రక్తపుటేర్లు కాదు కదా గులకరాయి విసిరే ధైర్యం కూడా ఎవరికీ లేదని అమిత్ షా అన్నారు.

Published : 27 May 2024 17:55 IST

చందౌలీ: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ హయాంలో ప్రతీ జిల్లాలోనూ ఓ గూండా ఉండేవాడని.. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా? అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు. గూండాల్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తలకిందులుగా వేలాడదీశారన్నారు.  చందౌలీలో భాజపా అభ్యర్థి మహేంద్రనాథ్‌ పాండే తరఫున అమిత్‌ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూపీని యోగి ఆదిత్యనాథ్‌ అభివృద్ధి పథంలో నడుపుతున్నారని కొనియాడారు.  ‘‘ఒకవైపు కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్.. మరోవైపు, రామమందిరం నిర్మించిన నరేంద్ర మోదీ.. ఎవరి వైపు ఉండాలో మీరే నిర్ణయించుకోండి. ఓవైపు ఎన్నికల్లో రూ.12లక్షల కోట్ల మోసాలు, కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన దురహంకార కూటమి.. ఇంకోవైపు 23 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా ఉన్నా 25 పైసలు కూడా అవినీతి ఆరోపణల్లేని మోదీ. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని మోదీ రద్దు చేశారు. ఈ ఆర్టికల్‌ను తొలగిస్తే అక్కడ రక్తపుటేర్లు పారతాయని రాహుల్‌ గాంధీ అప్పట్లో అన్నారు. రాహుల్‌ జీ.. ఇది భాజపా ప్రభుత్వం.. రక్తపుటేరులు మరిచిపోండి.. గులకరాయి విసిరే ధైర్యం కూడా ఎవరికీ లేదు’’ అన్నారు.

ఏపీలో వచ్చేది ఎన్డీయే సర్కారే

మోదీజీ 310 సీట్లు దాటేశారు..

‘‘కమలం గుర్తుపై ఉన్న బటన్‌ నొక్కి మహేంద్రనాథ్‌ పాండేకు వేసిన ఓటు నేరుగా మోదీకే వెళ్తుంది. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, పీవోకే కోసం అడగవద్దని కాంగ్రెస్‌ అంటోంది. రాహుల్‌ బాబా.. మీకు ఈ దేశం గురించి తెలియదు. చందౌలి ప్రజలు లేదా భాజపా శ్రేణులు అణుబాంబులకు భయపడరు. ఆరు దశల పోలింగ్‌ ముగిసింది. నా దగ్గర ఉన్న ఐదు విడతల డేటా ప్రకారం.. మోదీజీ 310 సీట్లు ఇప్పటికే గెలుచుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఆరు, ఏడో దశలో మీరు 400 సీట్లు దాటేలా సహకరించి మోదీని మూడోసారి ప్రధానిని చేయాలి’’ అని ప్రజలకు అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని