Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. 

Updated : 31 Oct 2023 12:54 IST

అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)కు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలని పేర్కొంది. సరెండర్‌ అయ్యే సమయంలో చికిత్స, ఆస్పత్రి వివరాలను సీల్డ్‌ కవర్‌లో జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని హైకోర్టు సూచించింది.

అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది. నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. 

సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. గత 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని