Chandrababu: అమరావతే రాజధాని.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది.

Updated : 11 Jun 2024 15:05 IST

అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు.  రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది’’

‘‘జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. భాజపా పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల దిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగింది. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు. తెదేపా, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. భాజపా, తెదేపా జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం’’

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం

మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు’’

నా కుటుంబానికి అవమానం జరిగింది..

‘‘ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది.  గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానని చెప్పా. నా శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం’’

రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది..

‘‘14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. సంక్షోభంలో ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. రైతులు అప్పులపాలయ్యారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’’

ఆ హోదా సేవ కోసమే..

‘‘సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్‌ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తా. మిత్రుడు పవన్‌తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. మీలో ఒకరిగా ఉంటాం. హోదా సేవ కోసమే తప్ప.. పెత్తనం కోసం కాదు. కాన్వాయ్‌ వచ్చే సమయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాం. ఒక సిగ్నల్‌కి మరో సిగ్నల్‌కి గ్యాప్‌ పెట్టుకోండి. ఐదు నిమిషాలు లేట్‌ అయినా పర్వాలేదు కానీ.. ప్రజలకు అసౌకర్యం కలగకూడదని స్పష్టంగా ఆదేశించాం. దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదు. ప్రజాహితం కోసమే పనిచేస్తాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. ‘స్టేట్‌ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తాం.

కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం

కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కింది. ముగ్గురు ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉండే అవకాశం వచ్చింది. రామ్మెహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మకు క్యాబినెట్‌లో చోటు కల్పించారు. సాధారణ వ్యక్తిగా ఉన్న శ్రీనివాస వర్మకు భాజపా ఎంపీ టికెట్‌ ఇచ్చినపుడే ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత ఆరా తీస్తే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని తెలిసింది.  సామాన్య కార్యకర్తను గుర్తించిన పార్టీ భాజపా. తెదేపా, జనసేన కూడా అలా చేస్తున్నాయి. పదేళ్ల మోదీ పరిపాలన దేశప్రతిష్ఠను పెంచింది. ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు తీసుకొచ్చింది. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగబోతోంది. ఆయన కల వికసిత్‌ భారత్‌- 2047. మనది వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌.. ఈ లక్ష్యంతో ముందుకెళ్లాలి’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని