BJP: మోదీ 3.O టీమ్‌లో మంత్రులెవరో..? కేబినెట్‌ కూర్పుపై భాజపా కీలక భేటీ

BJP Key Meet:మంత్రివర్గ కూర్పుపై భాజపా కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ అధ్యక్షుడు నడ్డా నివాసంలో అగ్రనేతలు దీనిపై సమాలోచనలు జరిపారు.  

Published : 06 Jun 2024 12:01 IST

దిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే (NDA) కూటమి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మోదీ (PM Modi)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మంత్రివర్గ (Union Cabinet) కూర్పుపైనే..! ఈసారి మోదీ కేబినెట్‌లో ఎవరికి చోటు లభించనుంది? మిత్ర పక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కేబినెట్‌ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం, తదుపరి కార్యాచరణపై భాజపా కసరత్తు మొదలుపెట్టింది.

గురువారం ఉదయం భాజపా (BJP) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు, ఆరెస్సెస్‌ కీలక నేతలు భేటీ (Key Meeting) అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా వంటి అంశాలపై చర్చించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఇతర సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరెస్సెస్‌ నుంచి సురేశ్‌ సోని, అరుణ్‌ కుమార్‌, దత్తాత్రేయ హొసబెళె పాల్గొన్నారు.

మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి విదేశీ నేతలు

ఈసారి ఎన్డీయే కూటమిలో తెదేపా (TDP), జేడీయూ పార్టీలు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలకు కేబినెట్‌లో ప్రాధాన్యం లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక, కర్ణాటకలో జేడీఎస్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఆ పార్టీ కీలక నేత కుమారస్వామికి వ్యవసాయ శాఖ కేటాయించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

దిల్లీకి ఎంపీలు, సీఎంలు..

ఇక, శుక్రవారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలంతా ఈ రాత్రికి దిల్లీ చేరుకోవాలని అధిష్ఠానం ఆదేశించింది. అటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రావాలని కోరింది. ఈ సమావేశం అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని