Chandrababu: పొత్తు ఖరారైన రోజే వైకాపా కాడి వదిలేసింది: చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు.

Updated : 24 Feb 2024 15:34 IST

అమరావతి: రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు. భాజపా కలిసొస్తే తగిన సమయంలో  నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు తెదేపా-జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తెదేపా తరఫున పోటీ చేసే 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

‘‘రాష్ట్ర భవిష్యత్‌ కోసమే జనసేనతో ఈ కలయిక. ఐదు కోట్ల ప్రజల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చాం. రాష్ట్ర చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజు. రాష్ట్ర విభజన తర్వాత కంటే వైకాపా పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది. బ్రాండ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నాశనం చేశారు. జగన్‌ పాలనలో సామాన్యులు, నేతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ను వైజాగ్‌లో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారు. పొత్తు కుదిరిన రోజే మా విజయం ఖరారైంది. ఆ రోజే వైకాపా కాడి వదిలేసింది’’ అని చంద్రబాబు అన్నారు.

TDP-Janasena: తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

‘‘నా రాజకీయ జీవితంలో అభ్యర్థుల జాబితా కోసం ఎప్పుడూ ఇంత  కసరత్తు చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో కోటి మంది అభిప్రాయం తీసుకున్నాం. ప్రజల మధ్యన ఉండే.. ప్రజలు కోరుకున్న వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తెదేపా నుంచి పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్నవారూ ఉన్నారు. అదే వైకాపా అభ్యర్థులను చూస్తే.. ఎర్ర చందనం స్మగ్లర్లను వారు పోటీకి పెట్టారు. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులనే  ఎంపిక చేశాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇరు పార్టీల గెలుపునకు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

స్ట్రైక్‌ రేట్‌ ముఖ్యం: పవన్‌

గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు ముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని, గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. భాజపాతో కలిసి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో కొన్ని స్థానాలను త్యాగం చేసినట్లు పేర్కొన్నారు. పొత్తులో భాగంగా త్యాగాలకు పాల్పడిన వారికి తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని తెదేపా- జనసేన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని