Chandrababu: జగనన్న కాదు.. జలగన్న: చంద్రబాబు

రాష్ట్రంలో దొంగలు పడ్డారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 15 Apr 2024 20:35 IST

పలాస: రాష్ట్రంలో దొంగలు పడ్డారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లపాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మద్యం, కరెంటు బిల్లు, ఇసుక, సిమెంట్‌, ఇనుము, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి.. ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చేశారని విమర్శించారు. చెత్తపన్ను, వృత్తిపన్ను పేరుతో ప్రజల్ని నిలువునా ముంచేశారని మండిపడ్డారు.

‘‘తిత్లీ తుపాను వచ్చినప్పుడు పలాసలోనే 14 రోజులు ఉండి చర్యలు చేపట్టాం. ఆ సమయంలో జగన్‌ పక్కనే ఉన్నా ఇక్కడికి రాలేదు. నాయకుడు అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే రావాలి. రూ.480 కోట్ల ప్యాకేజ్‌ ఇచ్చాకే పలాస నుంచి వెళ్లా. తుపానుకు దెబ్బతిన్న జీడి తోటలకు పరిహారం ఇచ్చాం. కిడ్నీ బాధితులకు మొట్టమొదట పింఛను ఇచ్చిన పార్టీ తెదేపా. కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుచేశాం. ఐదేళ్లలో కనీసం కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటుచేశారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా సాధించేది ఉత్తరాంధ్ర యువతేనన్న చంద్రబాబు... అందులో శ్రీకాకుళం యువత చాలామంది ఆర్మీలో ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు.  కాస్త అండగా నిలిస్తే మన యువత అద్భుతాలు చేస్తారన్నారు. ‘‘ విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకొస్తాం. పరిశ్రమలు వస్తే యువత బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వంశధార నీటిని బారువా వరకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తా. రూ.4 వేల పింఛన్‌ను ఇంటికే తీసుకొచ్చి ఇస్తాం. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని