ChandraBabu: మా కార్యకర్తలను హింసిస్తే మూల్యం తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

పుంగనూరులో తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారంటూ తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 07 Aug 2023 12:51 IST

ఏలూరు: పుంగనూరులో తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న తెదేపా నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో కార్యకర్తలను హింసకు గురిచేస్తే.. అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

‘‘అరెస్టు చేసిన వారి నుంచి బలవంతంగా తప్పుడు స్టేట్‌మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిసింది. పుంగనూరులో రాజకీయ నేతలను సంతృప్తి పరచడానికి తప్పులు చేసే ప్రతి అధికారి తర్వాతి కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరెస్టైన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. పార్టీ అండగా ఉంటుంది. మీ తరఫున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.  

Nadendla Manohar: ఏపీ సీఎంవోలో ఒక్కో పనికి ఒక్కో ధర: నాదెండ్ల

పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనకు సంబంధించి ఆదివారం 62 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఏలూరులో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని పీలేరు తెదేపా నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వివరించారు. పుంగనూరు ఘటనలో 5, అంగళ్లు ఘటనలో 2 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని