Revanth Reddy: నిజాంకు నకలు కేసీఆర్‌: సీఎం రేవంత్‌రెడ్డి

భారాస (BRS) ప్రభుత్వ హయాంలో నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని కేసీఆర్‌(KCR) చూశారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

Updated : 17 Mar 2024 15:03 IST

హైదరాబాద్‌: భారాస (BRS) ప్రభుత్వ హయాంలో నిజాం తరహాలో రాచరికాన్ని తీసుకురావాలని కేసీఆర్‌(KCR) చూశారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని.. కేసీఆర్‌ కూడా అలా చేయాలని భావించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘‘వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబాన్ని అధికారం నుంచి దించారు.  ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదు. ఏనాడూ ప్రజల స్వేచ్ఛను గౌరవించలేదు. నిజాం నకలునే కేసీఆర్‌ చూపించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేశారు. 1948 సెప్టెంబర్‌ 17కు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2023 డిసెంబర్‌ 3కూ అంతే ప్రాధాన్యం ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం రాచరిక పాలన అంతమైతే.. 2023 డిసెంబర్‌ 3న కేసీఆర్‌ పాలన పోయింది. నియంతలు ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌లో టీజీ బదులు టీఎస్‌ తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు నకలుగానే టీఎస్‌ను తెచ్చారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. మా ప్రభుత్వంలో ధర్నా చౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చాం. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తాం.

రైతు భరోసాపై ఆందోళన వద్దు..

అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ గోడలు బద్దలుకొట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు పనిలో స్వేచ్ఛను ఇచ్చాం. 26 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. 32 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత్‌ విద్యుత్‌ పథకాన్ని అందుకున్నాయి. రైతు భరోసా గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5 ఎకరాలు ఉన్న రైతుల వరకూ రైతుబంధు వారి ఖాతాల్లో పడింది. 62 లక్షల మందికి నగదు జమ చేశాం. ఇకపై గుట్టలు, రోడ్లు, బంగళాలు, లేఔట్లకు రైతు భరోసా ఇవ్వబోం. ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా దరఖాస్తు చేసుకోవాలి.. పరిశీలించి అందిస్తాం.

ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా?

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలుస్తామని భారాస, భాజపా నేతలు పదేపదే అంటున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా? కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని పెద్దలు చెప్పారు.. కొట్టకుండా ఊరుకుంటామా?మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫిరాయింపులకు పాల్పడలేదు. ఈరోజు నుంచే నేనూ రాజకీయం ప్రారంభించాను. మా పార్టీలోకి పొద్దున్నే ఒక గేటు తెరిచా.. మొత్తం ఇంకా తెరవలేదు. ఇవాళ ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు గేటు ఓపెన్‌ చేశాం. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నాకు మంచి మిత్రుడు. ఆయనకు బలహీనవర్గాల పట్ల నిబద్ధత ఉంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఉండాలని కోరారు.. తిరస్కరించారు. కానీ.. కేసీఆర్‌ ఎలాంటి వారి నుంచైనా సగం బలం గుంజుకుంటారు. ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరుతున్నారంటే నేనేమీ కామెంట్‌ చేయలేను’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని