Chhattisgarh Polls: కులగణన.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 రాయితీ: సీఎం బఘేల్‌

ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశకు రెండు రోజుల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం తన మ్యానిఫెస్టో విడుదల చేసింది.

Published : 05 Nov 2023 17:16 IST

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో (Chhattisgarh Elections) భాగంగా రాష్ట్రంలో తొలి దశ పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజులముందు ఆదివారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. రాయ్‌పుర్, రాజ్‌నంద్‌గావ్, జగదల్‌పూర్, బిలాస్‌పూర్, అంబికాపూర్, కవర్ధా నగరాల్లో దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించింది. రాజ్‌నంద్‌గావ్‌లో మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ మాట్లాడుతూ.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 చొప్పున రాయితీ ఇస్తామని, దీన్ని నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ ‘లోకల్‌’ మంత్రం.. భాజపా ‘నేషనల్‌’ తంత్రం!

ధాన్యానికి క్వింటాలుకు రూ.3,200 మద్దతు ధర అందజేస్తామని సీఎం బఘేల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు కొనసాగుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి నవంబర్ 7, 17వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలిదశలో 20 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో తొలిదశ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సంక్షేమం, అభివృద్ధి పేరిట కాంగ్రెస్‌ ఓట్లు అడుగుతుండగా.. అవినీతి ఆరోపణలతో బఘేల్‌ ప్రభుత్వంపై భాజపా విరుచుకుపడుతోంది.

మ్యానిఫెస్టోలోని కీలక హామీలు..

  • రైతుల రుణమాఫీ
  • కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం
  • గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 రాయితీ, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • 17.50 లక్షల పేద కుటుంబాలకు గృహ వసతి
  • 700 గ్రామీణ, పట్టణ పారిశ్రామిక పార్కుల నిర్మాణం
  • మహిళా స్వయం సహాయక సంఘాలు, సక్షం యోజన లబ్ధిదారుల రుణమాఫీ
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని