BJP vs Congress: కాంగ్రెస్‌ ‘లోకల్‌’ మంత్రం.. భాజపా ‘నేషనల్‌’ తంత్రం!

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా, కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడుతున్నాయి . అయితే, గతంలో పోల్చితే వాటి మధ్య కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

Updated : 04 Nov 2023 20:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని (Assembly Elections 2023) 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన భాజపా (BJP), కాంగ్రెస్‌కు (Congress) ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తుండగా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని పేరున్న భాజపా మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. తాజా ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఖరారు తదితర విషయాల్లో ఈ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం. కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి అభివృద్ధి పేరిట ఓట్లు అడుగుతుంటే.. భాజపా మాత్రం మోదీ పేరుతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

మూడు రాష్ట్రాల్లో ముఖాముఖి పోరు

మొత్తం ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు జరుగుతుండగా.. తెలంగాణలో అధికార భారాస, మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ నుంచి కాంగ్రెస్‌, భాజపా గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, మిజోరం మినహా మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే, అక్కడికి ఏడాది తర్వాత మధ్యప్రదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం కూలిపోయి.. భాజపా అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్‌లోనూ దాదాపు అదే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌పైలట్‌కు మధ్య విభేదాలు ఏర్పడి.. వేరుకుంపటి పెట్టే స్థితికి వచ్చారు. అయితే, అధిష్ఠానం కలుగజేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది.

అప్పుడు కాంగ్రెస్‌.. ఇప్పుడు భాజపా

సాధారణంగా కాంగ్రెస్‌ పార్టీలో హైకమాండ్‌దే నిర్ణయం. దిల్లీ నేతలు ఏం చెబితే.. రాష్ట్రస్థాయిలో అదే చెల్లుబాటవుతుంది. ఇదే విధానాన్ని తాజాగా భాజపా కూడా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సీట్ల కేటాయింపు, ముఖ్యమంత్రి అభ్యర్థులపై నిర్ణయాన్ని భాజపా అధిష్ఠానం తన గుప్పెట్లో పెట్టుకుంది. ఆయా రాష్ట్రాల్లో భాజపా సీఎం అభ్యర్థుల్ని ప్రకటించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్‌ సింగ్‌, మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌లో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలకు ప్రచార సారథ్యాన్ని అప్పగించేందుకు కేంద్ర నాయకత్వం ఇష్టపడకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కానీ, దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ మాత్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రులే కొనసాగుతారని పరోక్షంగా చెబుతూ..మధ్యప్రదేశ్‌లోనూ మాజీ సీఎం కమల్‌నాథ్‌కే ప్రచార బాధ్యతలు అప్పగించింది.

ఛత్తీస్‌గఢ్‌లో..

ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన రమణ్‌సింగ్‌ను ఈసారి భాజపా హైకమాండ్‌ పక్కనపెట్టింది. ఆయనకు టికెట్‌ వస్తుందో? రాదో అనే సందేహం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమైంది. అయితే, చివర్లో రమణ్‌సింగ్‌ టికెట్‌ కేటాయించడంతో ఆయన మద్దతుదారులు చల్లబడ్డారు. కానీ, ఆయన ముఖ్యమంత్రి రేసులో లేరని భాజపా చెప్పకనే చెబుతోంది. దీనికి భిన్నంగా అధికార కాంగ్రెస్‌ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసేసింది. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రస్తుత సీఎం భూపేశ్‌ బఘేల్‌ సీఎంగా కొనసాగుతారని ఘంటాపథంగా చెబుతోంది.

మధ్యప్రదేశ్‌లో గుబులు

మధ్యప్రదేశ్‌లోనూ భాజపా పరిస్థితి ఇలాగే ఉంది. సుదీర్ఘకాలంపాటు సీఎంగా సేవలందించిన శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కి ఈసారి ప్రాధాన్యత కొరవడింది. ఒకవేళ మళ్లీ భాజపా అధికారంలోకి వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం సందేహమే. కేంద్ర మంత్రుల్ని, జాతీయ స్థాయి నాయకుల్ని కమలదళం బరిలోకి దించడమే అందుకు నిదర్శనం. అలాగని ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును మాత్రం భాజపా బయటపెట్టడం లేదు. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా ప్రభావం తగ్గడం కూడా భాజపాకి శరాఘాతంగా మారింది. ఆయనతోపాటు గతంలో పార్టీలోకి వచ్చిన పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుతుండటంతో భాజపా నేతల్లో గుబులు పెరిగిపోతోంది.

రాజస్థాన్‌లో వ్యతిరేకత ఉన్నా..

రాజస్థాన్‌లో కొంతమేర అధికార వ్యతిరేకత కనిపిస్తున్నా.. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌పైలట్‌ నుంచి ముప్పు పొంచిఉన్నా.. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మాత్రం ప్రచారంలో వెనకడుగు వేయడం లేదు. రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఏడాదికి రూ.10వేల భృతి లాంటి ప్రజాకర్షక హామీలతో ముందుకెళ్తున్నారు. కానీ, ఈ రాష్ట్రంలోనూ సీఎం అభ్యర్థిపై భాజపాకి స్పష్టత లేదు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకురాలు వసుంధరా రాజేకు ప్రాధాన్యత తగ్గించిన హైకమాండ్.. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు వసుంధరా రాజేతోపాటు ఆమె మద్దతుదారులు కొందరికి చివర్లో టికెట్లు కేటాయించడం.. అంతర్గతంగా చర్చనీయాంశమైంది.

ఇదంతా భాజపా సీక్రెట్‌ తంత్రమా?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మిజోరంలో తక్కువ స్థానాల్లో బరిలోకి దిగుతున్నందున ఆ రాష్ట్రాన్ని పక్కన పెడితే.. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది తప్ప.. పేరును మాత్రం ప్రకటించలేదు.  మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్ చౌహాన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోందని గ్రహించిన అధిష్ఠానం దాని ప్రభావం పార్టీపై పడకుండా జాతీయ స్థాయి నాయకుల్ని తీసుకొచ్చింది. భాజపాకు గట్టిపట్టున్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలోని ఇతర వర్గాలు సహాయనిరాకరణ చేస్తాయన్న అనుమానంతో భాజపా సీఎం అభ్యర్థులపై పెదవి విప్పడం లేదు. ఫలితంగా పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేసి పార్టీ  విజయానికి దోహదపడతాయని అధిష్ఠానం యోచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

భాజపా, కాంగ్రెస్‌ ప్రత్యక్ష పోరుకు దిగుతున్న ఈ మూడు రాష్ట్రాలను పరిశీలించినట్లయితే... అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత సీఎంలనే కొనసాగిస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం పరోక్షంగా సంకేతాలిచ్చింది. వారు చేసిన అభివృద్ధి, సంక్షేమం పేరిట ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోంది. కానీ, భాజపా మాత్రం స్థానిక నేతలకు, మాజీ ముఖ్యమంత్రులకు ప్రాధాన్యత తగ్గించి దేశస్థాయిలో అభివృద్ధి, ప్రధాని మోదీ పేరిట ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి వ్యూహం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలంటే డిసెంబర్‌ 3 వరకు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని