Congress: కాంగ్రెస్‌ ఆరో జాబితా.. అమేఠీ, రాయ్‌బరేలీపై వీడని సస్పెన్స్‌

Congress: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈసారి కూడా అమేఠీ, రాయ్‌బరేలీ సీట్లపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Published : 25 Mar 2024 18:47 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీ ఆరో విడత అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. రాజస్థాన్‌లోని నాలుగు, తమిళనాడులోని ఒక స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పోటీ చేస్తున్న కోటా స్థానంలో భాజపా మాజీ నేత ప్రహ్లాద్‌ గుంజాల్‌ను బరిలోకి దించింది. రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజేకు అత్యంత సన్నిహితుడైన ప్రహ్లాద్‌ గత వారమే కాంగ్రెస్‌లో చేరారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నుంచి రామచంద్ర చౌధరీ, రాజసమంద్‌ నుంచి సుదర్శన్‌ రావత్‌, భిల్వారా నుంచి దామోదర్‌ గుర్జార్‌ను నిలబెట్టింది. తమిళనాడులోని తిరునెల్వేలి స్థానంలో ప్రముఖ అడ్వొకేట్‌ సి.రాబర్ట్‌ బ్రూస్‌ను పోటీకి దింపింది. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్‌ ఇప్పటివరకు 190 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

మహువా మొయిత్రా vs రాజమాత.. బెంగాల్‌లో మరో ఆసక్తికర పోరు

అమేఠీ, రాయ్‌బరేలీపై ప్రకటన ఎప్పుడో..?

తాజా జాబితాలో అమేఠీ, రాయ్‌బరేలీ పేర్లు లేకపోవడంతో ఇక్కడ గాంధీ కుటుంబసభ్యుల పోటీ ఉంటుందా, లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమేఠీ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేయకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ స్థానంలో ఈసారి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నా దీనిపై పార్టీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హోలీ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ ఇటీవల వెల్లడించారు. దీంతో, పార్టీ తదుపరి జాబితాలో ఈ స్థానాలపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని