Lok Sabha Polls: 19న సీడబ్ల్యూసీ కీలక భేటీ.. 20న కాంగ్రెస్‌ అభ్యర్థుల తదుపరి జాబితా!

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేస్తోంది.

Published : 17 Mar 2024 19:27 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన వేళ కాంగ్రెస్‌ పార్టీ (Congress) సర్వ సన్నద్ధత దిశగా కరసత్తు చేస్తోంది. ఈ ఎన్నికల బరిలో నిలిపేందుకు ఇప్పటికే రెండు విడతల్లో 82మందితో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ మిగతా అభ్యర్థుల ఖరారుతో పాటు మేనిఫెస్టో విడుదలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం మార్చి 19న కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ (CWC) భేటీ కానుంది. ఈ భేటీలో చర్చించి ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపం ఇవ్వనున్నారు. మార్చి 19న ముసాయిదా మేనిఫెస్టోకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే తమ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు యువత, మహిళలు, రైతులు, శ్రామికులు తదితర వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీలు ఏ ఒక్క వ్యక్తో ఇచ్చినవి కాదని.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినవని ఆయన పేర్కొన్నారు.

వికసిత భారత్‌ మాత్రమే కాదు.. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం: మోదీ

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి 19, 20 తేదీల్లో సమావేశమై మిగతా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 20న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఈసారి 20 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటే ప్రధాని మోదీకి భయమని, అందుకే ఖర్గే సొంత జిల్లా అయిన కలబురిగి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. కలబురిగితో పాటు 20 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ భాజపా 25 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి ఏడు విడతల్లో జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని