నాందేడ్‌ భారాస సభావేదికకు భూమిపూజ

మహారాష్ట్రలోని నాందేడ్‌లో వచ్చే నెల 5న నిర్వహించనున్న భారత్‌ రాష్ట్రసమితి బహిరంగ సభకు సంబంధించి వేదికకు పార్టీ నేతలు శనివారం భూమి పూజ నిర్వహించారు.

Published : 29 Jan 2023 03:12 IST

భారీ జనసమీకరణకు నాయకుల సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌, సారంగాపూర్‌, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని నాందేడ్‌లో వచ్చే నెల 5న నిర్వహించనున్న భారత్‌ రాష్ట్రసమితి బహిరంగ సభకు సంబంధించి వేదికకు పార్టీ నేతలు శనివారం భూమి పూజ నిర్వహించారు. ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసే తొలి సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారాస ఇప్పటికే వేదికను ఎంపిక చేసి నిర్వహణకు జిల్లా యంత్రాంగం అనుమతి తీసుకుంది. భూమిపూజ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, హనుమంత్‌ షిండే, జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్‌, తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు నాందేడ్‌లోని గురుద్వారాను సందర్శించారు. బహిరంగసభకు ముందు భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గురుద్వారాను సందర్శిస్తారని ఈ సందర్భంగా రవీందర్‌సింగ్‌ తెలిపారు.

తెలంగాణ మోడల్‌ దేశానికి అవసరం: ఇంద్రకరణ్‌రెడ్డి  

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం నేటి భారతావనికి అవసరమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. భారాస విస్తరణ కోసం మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించనున్న బహిరంగసభ సన్నాహకాల్లో భాగంగా శనివారం ఆయన.. ఆ రాష్ట్రంలోని అప్పారావుపేట్‌, షివిని, ఇస్లాపూర్‌, హిమాయత్‌నగర్‌ తదితర గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లోని భారాస మద్దతుదారులను కలిశారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. భారాస దేశానికి దిశా దశ చూపే శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలను మహరాష్ట్ర వాసులకు వివరించేందుకు బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.


ఒడిశాలో భారాస సభ!
ఫిబ్రవరి నెలాఖరులో నిర్వహించాలని సీఎం నిర్ణయం

ఈనాడు,హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్రసమితి బహిరంగ సభను ఫిబ్రవరి నెలాఖరులో ఒడిశాలో  నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌, ఆయన సతీమణి హేమ, కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, ఇతర ప్రతినిధులతో శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఒడిశా పార్టీ శాఖ, రైతు విభాగంతో పాటు ఆ రాష్ట్రంలో భారాస సభ ఏర్పాటుపై చర్చించారు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి రావాలని గిరిధర్‌ గమాంగ్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని