CM Jagan: గో‘దారి’లోకి వస్తారా?

ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు పార్టీలో కుమ్ములాటలు.. వీటన్నింటినీ మించి వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చూపిన ప్రభావం.. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ నేతలతో సోమవారం కీలక భేటీ నిర్వహించనున్నారు.

Updated : 07 Aug 2023 10:03 IST

గోదావరి జిల్లాల వైకాపా నేతలతో నేడు సీఎం భేటీ

ఈనాడు, అమరావతి: ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు పార్టీలో కుమ్ములాటలు.. వీటన్నింటినీ మించి వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చూపిన ప్రభావం.. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ నేతలతో సోమవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో జరిగే ఈ సమావేశంలో పార్టీలో వర్గ పోరుకు చెక్‌ పెట్టడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలు కీలకం కానున్నాయన్న అంతర్గత నివేదికల మేరకు సీఎం ఈ కసరత్తు నిర్వహిస్తున్నారని వైకాపా వర్గాలు తెలిపాయి. ఉభయగోదావరి జిల్లా (ఉమ్మడి)ల్లో అనుసరించాల్సిన పార్టీ ఎన్నికల వ్యూహంపై నేతలకు సీఎం సూత్రప్రాయంగా వివరిస్తారని అంటున్నారు. ఈ జిల్లాల్లో ప్రధానంగా తెదేపా, జనసేన ప్రభావం ఎలా ఉండనుందనే అంశాలపై తనకు వచ్చిన సమాచారాన్ని ఆయన పార్టీ నేతలతో చర్చించే అవకాశముంది.

ద్వారంపూడి… శ్రీ మల్లాడి  

బీసీ నాయకుడు, పుదుచ్చేరి మాజీ మంత్రి, తితిదే బోర్డు సభ్యుడు మల్లాడి కృష్ణారావు.. కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిల మధ్య విభేదాలపై సీఎం చర్చించే అవకాశముంది. కాకినాడ, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజికవర్గానికి మల్లాడి నేతగా ముద్రపడ్డారు. గత జూన్‌లో మల్లాడి జన్మదినం సందర్భంగా కాకినాడలో ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలతోనే వాటిని తొలగించారని కృష్ణారావు వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు జూన్‌లో బీసీ సంఘాలతో మల్లాడి కాకినాడలో సమావేశం తలపెట్టగా ఆ సభకు వైకాపాలోని కృష్ణారావు సామాజికవర్గానికి చెందిన కార్పొరేటర్లు, నేతలు వెళ్లకుండా.. అదే రోజు ఎమ్మెల్యే వర్గం బీసీ ర్యాలీకి సిద్ధమైంది. ఇరువర్గాలు తగ్గకపోవడంతో పోలీసులు వాటికి అనుమతి నిరాకరించారు. దీంతో మల్లాడి సభను, ఎమ్మెల్యే వర్గం ర్యాలీని విరమించుకున్నాయి. తాజాగా కృష్ణారావు బీసీ ప్రతినిధుల సభ పెట్టారు. దీనికి పోటీగా త్వరలో ఎమ్మెల్యే వర్గం మరో సభకు సిద్ధమవుతోంది.

ఈ వర్గపోరుపైనా..

అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌, ఎంపీ చింతా అనురాధ.. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం.. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. జగ్గంపేట టికెట్‌ రేసులో ఉన్న తోట నరసింహం నియోజకవర్గంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యేతో ఇద్దరు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ సభ్యురాలు విభేదించారు. ఏలేశ్వరంలో కొందరు కౌన్సిలర్లయితే ఏకంగా రాజీనామా చేశారు. వీటన్నింటిపై సీఎం వద్ద పంచాయితీ జరిగే అవకాశముందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.


రామచంద్రపురం కొలిక్కి తెస్తారా..?

రామచంద్రపురంలో మంత్రి వేణుగోపాలకృష్ణతో అమీతుమీకి ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తన కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోతే ఎంపీ పదవిని వదులుకుని స్వతంత్రంగానైనా బరిలో దిగుతానని ఆయన పేర్కొన్నారు. సీఎంను కలిసి మంత్రిపైనా ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలోనే మూడో వర్గం నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇటీవల సీఎం కార్యాలయానికి వచ్చి రామచంద్రపురంలో పరిస్థితులను వివరించారు. సీఎం జిల్లాకు వస్తారని, అక్కడే కలవాలని ఆయనకు అధికారులు చెప్పి పంపారు. సోమవారం ఈ ముగ్గురితో సీఎం చర్చించి రామచంద్రపురం సమస్యకు పరిష్కారం చూపుతారా? అనేది తేలాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని