సభలో మణిపుర్‌ వార్‌

అవిశ్వాసంపై బుధవారం లోక్‌సభలో కొనసాగిన చర్చ అధికార, ప్రతిపక్షాలమధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. సభ్యుల నినాదాలతో హోరెత్తింది.

Updated : 10 Aug 2023 07:29 IST

అవిశ్వాసంపై చర్చలో రాహుల్‌, అమిత్‌ షా ఢీ అంటే ఢీ
మణిపుర్‌లో భారతమాతకు భాజపా హాని చేసింది
దేశవ్యాప్తంగా కిరోసిన్‌ చల్లుతున్నారంటూ నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ
కాంగ్రెస్సే కలహాలమారి అంటూ అమిత్‌ షా ఎదురు దాడి
ఆ పార్టీయే అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజం
ఈనాడు - దిల్లీ

అవిశ్వాసంపై బుధవారం లోక్‌సభలో కొనసాగిన చర్చ అధికార, ప్రతిపక్షాలమధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఒకసారి వాయిదాపడింది. మణిపుర్‌లో భారత మాతకు భాజపా హాని చేసిందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆరోపించగా అవినీతిలో కూరుకుపోయిన నేతలను కాపాడుకునేందుకే ‘ఇండియా’ కూటమి జతకట్టి అవిశ్వాసం పెట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ హయాంలోనే దేశంలో అధికంగా మతకలహాలు జరిగాయని ఆరోపించారు. భారతమాతకు హాని చేశారన్న రాహుల్‌ వ్యాఖ్యలను మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రసంగం తర్వాత వెళ్తూ రాహుల్‌ గాలిలో ముద్దు ఇచ్చారని ఆరోపిస్తూ భాజపా మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదుచేశారు. మణిపుర్‌లో శాంతి నెలకొనేందుకు సహకరించాలని అక్కడి ప్రజలను కోరుతూ లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించింది. శాంతికి సహకరించాలని అమిత్‌ షా ఈ సందర్భంగా కోరారు.

ఈ పాలకులు దేశద్రోహులు: రాహుల్‌

ఇప్పుడున్న పాలకులు భారతమాతకు హాని చేసేవారే తప్ప కాపాడేవారు కాదని అవిశ్వాసంపై బుధవారం లోక్‌సభ జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. వారు దేశభక్తులు కాదని, దేశద్రోహులని మండిపడ్డారు. ‘గత ఏడాది 130 రోజులపాటు నేను దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు వెళ్లా. సముద్ర తీరం నుంచి కశ్మీర్‌ మంచు పర్వతాల వరకూ నడిచా. నా యాత్ర ఇంకా పూర్తి కాలేదు. ఇక ముందూ కొనసాగుతుంది. అయితే మొదట్లో యాత్ర ఎందుకు ప్రారంభిస్తున్నానో నాక్కూడా అంతు చిక్కలేదు. కాలం గడిచేకొద్దీ నాకు విషయం అర్థమవడం మొదలైంది. ఏ అంశాల్లో నన్ను ప్రేమించేవారో, ఏ అంశం కోసం నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యానో ఏ విషయంలో జైలుకు వెళ్లడానికి సిద్ధమయ్యానో, దేని గురించి గత పదేళ్లుగా ప్రతి రోజూ తిట్లు తింటున్నానో ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి అవకాశం లభించింది. నా యాత్రకు లక్షల మంది మద్దతు పలికారు. ఎంతో మంది నా దగ్గరకు వచ్చి వారి ఆలోచనలను పంచుకునేవారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7, 8 వరకూ సామాన్యులు పేదలు, ధనికులు, వ్యాపారులు, రైతులు, కార్మికుల గొంతు వినేవాడిని. ఈ దేశం కొన్ని భాషల సమాహారం అని, బంగారం, వెండి, నేల, మట్టి అని కొందరు చెబుతుంటారు. కానీ వాస్తవమేమిటంటే ఈ దేశం ఒక గొంతు. ఈ దేశ ప్రజలకు స్వరం ఉంది. బాధ, దుఃఖం, కష్టాలు ఉన్నాయి. మనం వాటిని వినాలంటే లోపలున్న అహంకారం, విద్వేషాన్ని విడిచిపెట్టాలి. లేదంటే వినలేం. కొన్ని రోజుల క్రితం మణిపుర్‌ వెళ్లా. ప్రధాని ఇప్పటివరకూ అక్కడికి వెళ్లలేదు.

ఆయన ఉద్దేశంలో మణిపుర్‌ భారత్‌ కాదు. ఈ ప్రభుత్వం మణిపుర్‌ను రక్షించకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. అక్కడి పునరావాస శిబిరాల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడా. మీకు ఏమైందని ఒక మహిళను అడిగితే తనకున్న ఒక్కగానొక్క కుమారుడిని తన కళ్ల ముందే కాల్చి చంపారని చెప్పారు. మరో శిబిరంలోని మహిళ నా వద్దకు వచ్చినప్పుడు ఏమైందని అడిగితే వెంటనే కంపించిపోయి స్పృహ తప్పి పడిపోయారు. ఇవి కేవలం రెండు ఉదాహరణలే. మీరు మణిపుర్‌లో భారత్‌ను గాయపరిచారు. మీ రాజకీయాలు మణిపుర్‌నే కాదు భారతదేశాన్నే గాయపరిచాయి. భారత్‌ స్వరాన్ని మణిపుర్‌లో నొక్కేశారు. మణిపుర్‌ ప్రజలను చంపి భారత మాతను గాయపరిచారు. అందుకే మీ ప్రధాని అక్కడికి వెళ్లలేదు. మణిపుర్‌లో మన అమ్మకు అవమానించారని చెబుతున్నా. సైన్యాన్ని రంగంలోకి దించితే ఒక్క రోజులో అక్కడ శాంతి నెలకొంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఉపయోగించలేదు. ప్రధాని మోదీ ఈ దేశ గొంతు వినకపోతే ఇంకెవరి గొంతు వింటారు. రావణుడు ఇద్దరి మాటలే విన్నారని చెబుతారు. అందులో ఒకరు మేఘనాథుడు, రెండో వ్యక్తి కుంభకర్ణుడు. ఇక్కడ ప్రధాని మోదీ.. అమిత్‌ షా, అదానీ మాటలే వింటున్నారు. లంకను దహనం చేసింది రావణుడి అహంకారం తప్పితే హనుమంతుడు కాదు. రావణుడిని చంపింది అతడి అహంకారం తప్పితే రాముడు కాదు. ఇప్పుడు వీళ్లు దేశం మొత్తం కిరోసిన్‌ చల్లుతున్నారు. మణిపుర్‌లో కిరోసిన్‌ చిలకరించి మంటపెట్టారు. ఇప్పుడు హరియాణాలో కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతమాతను గాయపరుస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.

స్పీకర్‌కు ధన్యవాదాలు

అనర్హత వేటును తొలగించిన తర్వాత తొలిసారిగా రాహుల్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు. ‘క్రితం సారి నేను మాట్లాడినప్పుడు నేను మీకు కొంత కష్టం కలిగించా. అదానీ గురించి చాలా గట్టిగా మాట్లాడా. అది మీ సీనియర్‌ నేతకు కొంత కష్టం కలిగించింది. ఆ కష్టం ప్రభావం మీమీదా పడింది అనుకుంటున్నా. అందుకే మీకు క్షమాపణ చెబుతున్నా. ఈ రోజు భాజపా మిత్రులు భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రసంగం అదానీ గురించి ఉండదు కాబట్టి మీరు ఊపిరి పీల్చుకుని శాంతంగా ఉండొచ్చు. ఈ రోజు నేను మెదడుతో కాకుండా హృదయంతో మాట్లాడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు. మోదీ, అదానీ కలిసి కూర్చున్న చిత్రాన్ని రాహుల్‌ తన ప్రసంగం సందర్భంగా చూపారు. అదానీ గ్రూప్‌ ప్రధాని సభలో లేరని వ్యాఖ్యానించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో చిత్రాన్ని చూపొద్దని రాహుల్‌కు స్పీకర్‌ సూచించారు. భారత మాతను ప్రస్తావించవద్దనీ పేర్కొన్నారు. దీంతో మణిపుర్‌లో గాయపడిన తన తల్లి (భారత మాత) గురించి మాట్లాడుతున్నానని రాహుల్‌ సమాధానమిచ్చారు. సుమారు 30 నిమిషాలపాటు ఆయన మాట్లాడారు. రాహుల్‌ ప్రసంగాన్ని వినేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు సందర్శకుల గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ హాజరు కాకపోవడాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. వారు ఆందోళనకు దిగడంతో సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. తొలుత సభ సమావేశమైనప్పుడు క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ్యులు నివాళులర్పించారు. జపాన్‌లో అణు బాంబుల దాడుల్లో మరణించిన వారికీ సభ నివాళులర్పించింది. ఆ తర్వాత సభ్యుల నిరనసల మధ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్‌ కొనసాగించారు. సుమారు 45 నిమిషాల పాటు అది సాగింది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఇంత సేపు ప్రశ్నోత్తరాలు కొనసాగడం ఇదే ప్రథమం.

స్పీకర్‌కు ఫిర్యాదు

రాహుల్‌ గాంధీ గాలిలో ముద్దు ఇవ్వడంపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్మృతి ఇరానీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ‘స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంటులో మహిళా ఎంపీలకు గాలిలో ముద్దు ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకూ ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదుపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ సంజ్ఞ చేయలేదని పేర్కొన్నాయి.


రిజిజు వ్యాఖ్యలపై గందరగోళం

రాహుల్‌ ప్రసంగిస్తుండగా అధికార పక్ష సభ్యులు తీవ్రంగా నిరసనలు తెలిపారు. ఈశాన్యంలో చొరబాట్లకు, ఇతర సమస్యలకు కాంగ్రెస్సే కారణమని, రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని మంత్రి కిరణ్‌ రిజిజు డిమాండు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అందులో ఒకరు స్పీకర్‌ డెస్క్‌కు తగిలారు. రాహుల్‌ ప్రసంగానికి అడ్డు తగిలితే గురువారం మోదీ ప్రసంగాన్నీ అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో మంత్రి ప్రహ్లాద్‌ జోషి భాజపా సభ్యులవద్దకెళ్లి నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. ప్రసంగం అనంతరం సభ నుంచి రాహుల్‌ వెళ్తుండగా భాజపా సభ్యులు కేకలు వేశారు. దీంతో ఆయన వారివైపు తిరిగి గాలిలో ముద్దు ఇచ్చి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని