Daggubati Venkateswara Rao: ‘పర్చూరులో నేను ఓడిపోవడమే మంచిదైంది’

గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం సొంతూరు కారంచేడులో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 26 Dec 2023 10:09 IST

వైకాపా పాలనలో రోడ్ల దుస్థితి దారుణం
గెలిచి ఉంటే ఈ రోడ్లమీద తలెత్తుకు తిరగగలిగేవాణ్నా?
మాజీ మంత్రి దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు, బాపట్ల: గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) సోమవారం సొంతూరు కారంచేడులో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడి దయ వల్ల ఆ ఎన్నికల్లో నేను ఓడిపోవటమే మంచిదైంది.. నేను గెలిచి ఉంటే రోడ్డు వేయలేదని ప్రజలు నన్ను నిలదీసేవారు. ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపించి ఉంటే నేను ఇప్పుడు ఈ రోడ్లమీద ఇలా తలెత్తుకు తిరిగి ఉండగలిగేవాణ్నా’ అని వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో రహదారులకు కనీసం మరమ్మతులు కూడా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తన మంచి కోరి, తన వ్యక్తిత్వం గుర్తించే తనను ఓడించి మంచి చేశాడని ఆయన పేర్కొన్నారు.

జగన్‌ నిబంధనలకు మేం తలొగ్గలేదు..

‘నేను ఓడిన రెండు నెలలకు జగన్‌ పిలిచారు. మా అబ్బాయిని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తామన్నారు. ఆ క్రమంలో జగన్‌ పెట్టిన నిబంధనలకు మా అబ్బాయి తలొగ్గలేదు. మనం ఇక్కడ ఇమడలేమనుకుని రాజకీయాలొద్దు.. వెళ్లిపోదాం.. కారు హైదరాబాద్‌ వైపు తిప్పమని చెప్పి తిరస్కరించి వచ్చేశాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పర విమర్శలు.. ప్రతి విమర్శలే. నేతలు పరస్పరం తిట్టుకోవటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో చూశా. మనకు అవకాశం వచ్చినప్పుడల్లా అభివృద్ధి పనులు చేయాలి. నా గ్రామాన్ని (కారంచేడును) అభివృద్ధి చేయటమే నాకు ఆత్మసంతృప్తినిస్తుంది. మంత్రి పదవులు చేశాం. మాకు ఇంకేం కావాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 నియోజకవర్గాలు తెలుసు. సమస్యల పరిష్కారం కోరుతూ నా వద్దకు వస్తే సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరించి పంపటమే తప్ప నాన్చటం తెలియదు. నన్ను నడిపించేది భగవంతుడే. ఏ పని చేసినా తప్పు లేదు. ప్రస్తుతం నా మనవళ్లతో సంతోషంగా గడుపుతున్నాను’ అని దగ్గుబాటి చెప్పారు. భాజపా అధికారంలో లేనప్పుడే తన భార్య పురందేశ్వరి ఆ పార్టీలోకి వెళ్లారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని