TDP - Janasena: తెలుగు జన ఆశీర్వాదం

2019 ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి జగన్‌ అడిగారు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. అట్టర్‌ఫ్లాప్‌ సినిమా చూపించారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ ఉండదు.

Updated : 29 Feb 2024 10:16 IST

తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం
పొత్తు సూపర్‌హిట్‌ అంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ జయకేతనం
ఆటంకాలున్నా ఆగక తరలివచ్చిన జనసందోహం
క్యాడర్‌ కలిసి పనిచేయాలి.. కసిగా పనిచేయాలని తెదేపా, జనసేన అధినేతల పిలుపు
తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం నుంచి ఈనాడు ప్రతినిధి

2019 ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి జగన్‌ అడిగారు. ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. అట్టర్‌ఫ్లాప్‌ సినిమా చూపించారు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ ఉండదు. మేం అధికారంలోకి వస్తే బాదుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం. నీళ్లిచ్చి రైతుల్ని బతికిస్తాం. యువతకు ఉద్యోగాలిస్తాం. ఇప్పటికే సూపర్‌-6 పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించాం.

చంద్రబాబు


తెదేపాతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే.. ఇంతేనా అని అవతలివాళ్లు (వైకాపా) అంటున్నారు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ని చూసి ఇంతేనా? అన్నాడు. చివరకు నెత్తిమీద కాలుపెట్టి అథఃపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని.. ఇంతింతై వటుడింతై.. అన్నట్లు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది. జగన్‌ గుర్తుపెట్టుకో.. అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కల్యాణ్‌ కాదు.. నా పార్టీ జనసేన కాదు.

పవన్‌కల్యాణ్‌


తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహించిన తెలుగు జన విజయకేతనం ‘జెండా’... సభ పేరుకు తగ్గట్టే జనజాతరను తలపించింది. రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది. తరలివచ్చిన జనసమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది. సభా ప్రాంగణం అంతటా తెలుగుదేశం, జనసేన జెండాలు చేబూనిన యువత, మహిళలు సభ జరుగుతున్నంత సేపూ వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల జెండాలు చేబూని, యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయజయ ధ్వానాలు రెండు పార్టీల్లో సమరోత్సాహం నింపాయి. జగన్‌ను తరిమికొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవునంటూ ప్రతిస్పందించారు. ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు. రెండు పార్టీల పొత్తు సూపర్‌హిట్‌ అని చంద్రబాబు చెబితే జయజయ ధ్వానాలు చేశారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్‌కు 2024 ఎన్నికల్లో యుద్ధం ఇద్దాం అనడంతో పాటు వామనుడు మూడడుగుల నేల అడిగి బలిచక్రవర్తిని అణిచేసినట్లు జగన్‌ పాలనను నేలమట్టం చేస్తానంటూ పవన్‌కల్యాణ్‌ చేసిన హెచ్చరికలతో అభిమాన సందోహం కేరింతలు కొట్టింది.

ఆటంకాలెదురైనా..

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం రెండు పార్టీలు భారీ బహిరంగసభను నిర్వహించాయి. జాతీయ రహదారిని ఆనుకుని విశాలమైన మైదానంలో ఈ సభను నిర్వహించాయి. వైకాపా ప్రభుత్వం ఆర్టీసీˆ బస్సులు ఇవ్వకపోయినా, ఆర్‌టీఏ యంత్రాంగం బెదిరింపులతో ప్రైవేటు బస్సులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా, మరోవైపు పరీక్షలు జరుగుతున్నా సభకు ఇవేమీ ఆటంకాలు కాలేదు. సభ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే రెండు పార్టీలు దీన్ని విజయవంతం చేశాయి. యువతీ, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం సభ ప్రారంభమయ్యేసరికే ప్రాంగణం నిండిపోయింది. కుర్చీలు ఖాళీ లేకపోవడంతో కొందరు బయటకు వెళ్లి రోడ్లపై నిలబడ్డారు. ఒకవైపు సభ ప్రారంభమైంది. మరోవైపు జాతీయరహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ ఆగిపోవడంతో సభకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొందరు పొలాల వెంట, పుంత దారుల్లో సభాస్థలికి చేరుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. అక్కడకు అటూ, ఇటూ ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అనేకమంది ప్రజలు రోడ్లపైనే నిలిచి సభను తిలకించారు. సభా ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో బయట కూడా దాదాపు అంతమంది ఉన్నారు.

యువోత్సాహం...

ఈ సభలో యువత ఉత్సాహం అంతా ఇంతా కాదు. బహిరంగసభ వేదిక ముందు డి జోన్‌ ఏర్పాటుచేశారు. ఆ జోన్‌లోకి ఎవరూ రాకూడదు. సభ సగం అయ్యేసరికి యువత బారికేడ్లు దాటుకుంటూ పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చేశారు. చంద్రబాబు జడ్‌ ప్లస్‌ కేటగిరీ కావడంతో పాటు పవన్‌కల్యాణ్‌ ప్రైవేటు సెక్యూరిటీ కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువత వేదిక ఎక్కి నేతల వద్దకు వచ్చేయాలని ముందుకు చొచ్చుకొచ్చారు. పోలీసులు దాదాపు చేతులు ఎత్తేశారు. అసలిక్కడ బందోబస్తు ఏర్పాట్లు సరిగా చేయలేదు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలే శ్రమించారు. మరోవైపు వేదికకు ఎడమవైపున చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ హెలికాప్టర్‌ దిగి వేదిక వద్దకు వచ్చేందుకు ఖాళీస్థలం వదిలారు. యువత అటువైపుగా వేదిక వైపు చొచ్చుకువచ్చేందుకు బారికేడ్లు తొలగించగా.. వారిని నియంత్రించడం సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రసంగిస్తూ... ప్రజలను భాగస్వాములను చేస్తూ...

చంద్రబాబు ప్రసంగిస్తూ, అనేకసార్లు ప్రజలతో సమాధానం చెప్పించారు. తెలుగు రోషం చూపిద్దామా, జగన్‌ను ఓడిద్దామా అని ప్రశ్నించి సభికులతో చప్పట్లు కొట్టించారు. ప్రశ్నలు వేస్తూ ప్రజల నుంచి స్పందన కోరితే విశేష ప్రతిస్పందన కనిపించింది. ఇద్దరు నేతలు పొత్తు అవసరాన్ని, రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ నాయకులెవరూ ఎక్కువ, తక్కువ కాదని పేర్కొన్నారు. ఒక పార్టీ వెనుక మరో పార్టీ నడవడం లేదు... రెండు పార్టీలూ కలిసి నడుస్తున్నాయని చెప్పారు. జగన్‌ సినిమాకు సీక్వెల్‌ లేదు.. ఆ సినిమా ముగిసిపోయిందని ప్రకటించారు. రెండు పార్టీల నాయకులు, క్యాడర్‌ కలిసి పనిచేయాలని, కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఒకరినొకరు పొగుడుతూ..

పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు పొగిడారు. ఆయన గొప్పతనాన్ని వివరించారు. చంద్రబాబును పవన్‌కల్యాణ్‌ రాజకీయ ఉద్దండుడు అని చెప్పారు. క్లెమోర్‌మైన్‌ పేలి అంత ఎత్తు ఎగిరిపడ్డా లేచి నిలబడి దుమ్ము దులుపుకొని నడవండి అంటూ నడిపించిన ధీశాలి చంద్రబాబు అని పేర్కొన్నారు. తన పొత్తు నిర్ణయంపై కొందరు ఇస్తున్న సలహాలపై మండిపడ్డారు. జనసేనకు సలహాలు అవసరం లేదని, యుద్ధం చేసే యువత కావాలని తేల్చిచెప్పారు. ప్రారంభంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రెండు పార్టీల జెండాలు చేబూని ఊపారు. తర్వాత తెదేపా జెండాను పవన్‌కల్యాణ్‌, జనసేన జెండాను చంద్రబాబు పట్టుకుని రెపరెపలాడించారు.


కులమతాల మధ్య చిచ్చుపెట్టే వైకాపాకు గుణపాఠం చెప్పాలి
- హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

‘‘బ్రిటిష్‌ పాలకులు విభజించు పాలించు అనే విధానం అవలంబించినట్లే.. వైకాపా కూడా రాష్ట్రాన్ని కులమతాల పేరిట విభజించి, చిచ్చుపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాటకాలు ఆడుతోంది. ఇలాంటివారికి చెక్‌ పెట్టేందుకు మీకున్న ఓటనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకొని తెదేపా, జనసేన కూటమిని ఆశీర్వదించండి. మీ కోసం, మీ రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లల భవిత కోసం ఈ కూటమిని ఎన్నుకోవాలి. వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసింది. చంద్రబాబు హయాంలో రాయలసీమ రైతులకు 90% సబ్సిడీతో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌ పరికరాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం దాని ఉనికే లేకుండా చేసింది.’’


తెదేపా-జనసేన పొత్తు ప్రజలే కోరుకున్నారు
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

‘‘తెదేపా, జనసేనల పొత్తు జనం నుంచి పుట్టింది. ఈ పొత్తు చరిత్ర సృష్టించబోతోంది. కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకూ అందరూ ఈ కూటమిని కోరుకుంటున్నారు. జగన్‌ పాలనలో మోసపోయిన మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు కోరుకున్న పొత్తు ఇది. రెండు పార్టీలూ కలిసి పనిచేసి ఓటు బదిలీ చేసుకుంటే 160 స్థానాల్లో కూటమి గెలుపు ఖాయం.’’


కృష్ణార్జునులకు తోడుగా భాజపా వస్తోంది
- రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ

‘‘నేను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. త్వరలోనే తెదేపా-జనసేన కూటమి అభ్యర్థిగా వస్తా. నరసాపురం నుంచే మళ్లీ పోటీ చేస్తా. ఇంతకంటే పెద్ద సభను ముందుండి నడిపిస్తా. త్వరలోనే కృష్ణార్జునులకు భాజపా కూడా తోడవుతుంది. జగన్‌ అరాచక ప్రభుత్వాన్ని తుదముట్టిస్తాం. విశాఖలో ఏర్పాటుచేసిన తేలియాడే వంతెన ఒక్క రోజులోనే తెగిపోయింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మాదిరే పార్టీ కార్యకర్తలూ అన్నదమ్ముల్లా పనిచేయాలి. ఎవరెవరో ఏవేవో లేఖలు రాస్తారు. వాటిని పట్టించుకోవద్దు.’’


ఉత్తరాంధ్ర వాసిగా చెబుతున్నా.. అమరావతే ఏకైక రాజధాని
- కొణతాల రామకృష్ణ, మాజీమంత్రి, జనసేన నేత

‘‘నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చినా విశాఖపట్నం రాజధాని అంటే ఏ రోజూ స్వాగతించలేదు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలి. తెదేపా, జనసేన, భాజపా పొత్తు త్రివేణీ సంగమం. త్వరలోనే భాజపా వచ్చి చేరుతుంది. ఇది చారిత్రక అవసరం. వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా, పూర్వవైభవం రావాలన్నా, ప్రాజెక్టులు పూర్తికావాలన్నా కూటమి గెలవాలి.’’


దారులన్నీ గూడెం వైపు

తాడేపల్లిగూడెం అర్బన్‌, పట్టణం, పెంటపాడు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బుధవారం నిర్వహించిన తెలుగుజన విజయకేతనం జెండా సభకు తెదేపా శ్రేణులు, జనసైనికులు పోటెత్తారు. రాష్ట్రం నలుమాలల నుంచి వచ్చిన వారి జై చంద్రన్న, జై పవన్‌ నినాదాలతో జాతీయరహదారి మార్మోగింది. జనం భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు కదలకపోవడంతో పొలం గట్లు, పుంతరోడ్ల వెంబడి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.  

అరకొర బందోబస్తు: సభాప్రాంగణం నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలోని 15 ఎకరాల ఖాళీ స్థలంలో వీఐపీ కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు, ఆటోలకు పార్కింగ్‌ కేటాయించారు. ఇక్కడ వాహనాలను నిలిపి సభాప్రాంగణం వద్దకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. జాతీయరహదారి మీదుగా వెళ్లే ఇతర వాహనాలను పోలీసులు దారి మళ్లించే ప్రయత్నం చేయలేదు. అదనపు బలగాలూ లేకపోవడంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేకపోయారు. సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అభిమానులు, కార్యకర్తలు సభ వద్దకు చేరుకునేందుకు రాంగ్‌రూట్‌లో ప్రయాణం కొనసాగించారు. వాహనాలు అడ్డుకునే క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభిమానుల తాకిడి తట్టుకోలేక ఒకానొక సమయంలో పోలీసు యంత్రాంగం చేతులెత్తేసింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని