Mahasena Rajesh: అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతా: మహాసేన రాజేష్‌

‘నాపై వైకాపా కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదు.

Updated : 03 Mar 2024 12:24 IST

ఈనాడు-అమరావతి, శంఖవరం, న్యూస్‌టుడే: ‘నాపై వైకాపా కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారంతో పార్టీకి నష్టం కలగకూడదు. తెదేపా-జనసేనపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైతే పోటీ నుంచి వైదొలుగుతాను’ అని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి మహాసేన రాజేష్‌ శనివారం ప్రకటించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పి.గన్నవరం అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా ఉత్తరకంచిలోని తన నివాసంలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు.

గెలిస్తే చంపేస్తారేమో..!: ‘ఒక సామాన్యుడికి అవకాశం వస్తే వ్యవస్థ ఎలా ఏకమైపోతోందో రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. పోటీ చేయడానికి వస్తేనే ఇంతలా చేస్తున్నారంటే.. ఒకవేళ గెలిచి ఉంటే చంపేస్తారేమో..! పాత వీడియోలను ఎడిట్‌ చేసి నాతో పాటు తెదేపా-జనసేనలను కించపరిచేందుకు వైకాపా కుట్రలు చేస్తోంది. ఏడేళ్ల క్రితం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇది సరైంది కాదు. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే ఎంతవరకైనా తగ్గడానికి సిద్ధం. జగన్‌రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప.. పదవులు కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. వివేకా హత్యకేసులో నిందితుడు అవినాష్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు అనంతబాబుకు ఏ అడ్డూ లేదు. వాళ్లు పోటీచేస్తారు. ప్రచారమూ చేస్తారు. కానీ మహాసేన రాజేష్‌ మాత్రం పోటీ చేయకూడదట. అప్పట్లో అంబేడ్కర్‌ చాలా అవమానాలు పడ్డారని పుస్తకాల్లో చదవడమే..! అలాంటి అనుభవాలు నా జీవితంలో ఇప్పుడు మళ్లీ ఎదురయ్యాయి. ఇంకా నా జాతి ఎక్కడుందో, మమ్మల్ని ఎలా అవమానిస్తున్నారో, ఎలా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఒకవేళ అధిష్ఠానం తప్పదంటే, పోటీచేసి గెలిచే మొట్టమొదటి నియోజకవర్గం పి.గన్నవరమే’ అని రాజేష్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని