ఇక మాటల మంటలే!

లోక్‌సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

Updated : 16 Apr 2024 11:12 IST

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మూడు ప్రధాన పార్టీలు

లోక్‌సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా.


28 రోజులు.. 50 సభలు

ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌ ప్రచార ప్రణాళిక సిద్ధం
పదేళ్ల భారాస, భాజపా.. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనను పోలుస్తూ ప్రచారపత్రాల తయారీ
నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున ప్రారంభించి.. రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా కదనరంగంలోకి దిగేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తోంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. గత వంద రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. గత పదేళ్లలో తెలంగాణలో భారాస, కేంద్రంలో భాజపా సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, వంద రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను సైతం విడిగా తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా గ్రామాల్లో ప్రచారానికి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఇచ్చే  హామీలపై స్థానిక నేతలకు రాష్ట్ర ప్రచార కమిటీ సూచనలు పంపాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

సీఎం సభలు.. రోడ్‌షోలు

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 దాకా రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కనీసం మూడుచోట్ల సీఎం సభలు నిర్వహించాలనేది ప్రణాళిక. గ్రేటర్‌ హైదరాబాద్‌ కలసిఉన్న లోక్‌సభ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎంపీగా నెగ్గిన మల్కాజిగిరి కూడా నగరం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగరం పరిధిలోని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన రోడ్‌షోలు ఎక్కువగా నిర్వహించనున్నారు. పోలింగ్‌ తేదీ దగ్గరపడే సమయంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.

తరలిరానున్న ప్రముఖులు

అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు సైతం తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలున్నాయి. వారి వీలును బట్టి సభలు, రోడ్‌షోలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లే కాకుండా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచించింది.

అంతర్గత సర్వేలతో అప్రమత్తం

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది. ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతోంది, ఎక్కడ వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు హైదరాబాద్‌, దిల్లీల్లోని పార్టీ వార్‌ రూంలకు సమాచారం పంపుతారు. వార్‌ రూంల నుంచి సైతం నేరుగా ఓటర్లకు ఫోన్‌ చేసి ప్రచారం ఎలా జరుగుతోంది, కాంగ్రెస్‌ నేతలు మీ వద్దకు వచ్చారా అని అంతర్గత సర్వే చేస్తారు.  ప్రచార పత్రాలు సిద్ధం చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి విడివిడిగా ప్రచార ప్రణాళిక రూపొందిస్తున్నామని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ‘ఈనాడు’కు తెలిపారు.

2-3 రోజుల్లో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వారి పేర్లను 2-3 రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్తున్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.  

మహారాష్ట్రలోనూ రేవంత్‌ ప్రచారం

ఈ నెల 12, 13 తేదీల్లో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని మహారాష్ట్రలో పెద్దసంఖ్యలో గ్రామాలు, పలు నియోజకవర్గాలున్నాయి. అక్కడ తెలంగాణ సీఎం ప్రచారం అవసరమని భావించి.. ఆయనను మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారాసకు లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి.. పూర్వవైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో చైతన్యం కలిగించడం, తమ పాలన కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు సన్నద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి..


ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం

 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో పది, అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎనిమిది శాసనసభ స్థానాల్లోనే గెలిచినా.. గతంలో కన్నా ఓట్ల శాతం పెరిగింది.  మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని