మద్యం అమ్మేది జగనే

2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్‌ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

Published : 19 Apr 2024 06:23 IST

కల్తీ సరకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు
ప్రత్యేక హోదాను భాజపాకు తాకట్టు పెట్టారు
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: 2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్‌ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాకే ఓట్లు అడుగుతానని చెప్పి, మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధం మాట పక్కనపెడితే.. ప్రభుత్వమే మద్యం అమ్మడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ న్యాయ యాత్రలో భాగంగా గురువారం ఆమె శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, అనంతపురం జిల్లా శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ‘రాష్ట్రంలో జగనే మద్యం అమ్ముతున్నారు. విచ్చలవిడిగా కల్తీ సరకు అమ్ముతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ఒక చేత్తో బటన్‌ నొక్కుతూ మరో చేత్తో ప్రజల సొత్తును గుంజుకుంటున్నారు. అన్ని ధరలూ పెంచి పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చింది వెనక్కి తీసుకుంటున్నారు. మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు లాగేసుకుంటున్నారని ప్రజలు గమనించాలి. పథకాల్లో వైఎస్సార్‌ ఫొటో ఎప్పుడో తొలగించారు. ఇప్పుడు సాక్షి పత్రికలోనూ ఆయన బొమ్మ లేకుండా మాయం చేశారు. వైఎస్సార్‌ హయాంలో వ్యవసాయం పండగలా ఉండేది. జగన్‌ పాలనలో రైతులు నిండా మునిగారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి, ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేశారు. జగన్‌ పాలనలో అప్పులపాలు కాని రైతులు లేరు’ అని షర్మిల విమర్శలు గుప్పించారు.

కోటలో ఉంటే సమస్యలెలా తెలుస్తాయి?: సీఎం జగన్‌ అయిదేళ్లు తాడేపల్లి కోట దాటి బయటకు రాలేదని, ఇప్పుడు ఎన్నికల కోసమే సిద్ధం అంటూ బస్సులో తిరుగుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. కోటలో ఉన్న వ్యక్తికి ప్రజల సమస్యలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడుప్రజాదర్బార్‌ నిర్వహించి, రోజూ ప్రజల్ని కలిసేవారు. ఆయన పేరు చెప్పుకొని సీఎం కుర్చీ ఎక్కిన జగన్‌ మాత్రం అయిదేళ్లలో ఒక్కరినీ కలవలేదని పేర్కొన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, మోదీకి తలవంచారన్నారు. వైకాపా నేతలు ఓట్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులిచ్చేందుకు వస్తారని, అవి మీ డబ్బులేనని.. వాటిని తీసుకోండని చెప్పారు. కానీ, ఓటు మాత్రం కాంగ్రెస్‌ వేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని