డీకే అరుణకు రూ.66.75 కోట్ల ఆస్తులు

మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

Published : 19 Apr 2024 04:17 IST

మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. తనపై ఆరు కేసులు ఉన్నట్లు తెలిపారు. ‘‘1.54 కిలోల బంగారు ఆభరణాలు, కుటుంబానికి 93 ఎకరాల వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వ్యక్తిగతంగా తన చేతిలో రూ.1.5 లక్షలు, భర్త డీకే భరత్‌సింహారెడ్డి వద్ద రూ.20 లక్షల నగదు, దంపతులు ఇద్దరికీ కలిపి రూ.2.26 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, పలు కంపెనీల్లో రూ.28.45 లక్షల విలువైన షేర్లు, పోస్టాఫీసు బాండ్లలో రూ.16.50 లక్షలు ఉన్నాయి. తమ కుటుంబం ప్రస్తుతం 17 ప్రభుత్వ రోడ్లు, ఇతర కాంట్రాక్టులు చేస్తోంది. తనకు రూ.25 లక్షల విలువైన కారు ఉంది. భర్త పేరిట రూ.9.50 కోట్ల విలువైన వివిధ వాహనాలు 80 ఉన్నాయి. వ్యక్తిగతంగా రోడ్‌టెక్‌ హాట్‌మిక్స్‌ంగ్‌ ప్లాంటులో 25 శాతం వాటా ఉంది. భర్త పేరిట గ్యాస్‌ డిస్ట్రిబ్యూటరీ ఉంది’’ అని వెల్లడించారు.

ఈటలకు రూ.54.01 కోట్ల ఆస్తులు.. 54 కేసులు

మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌.. తమ కుటుంబానికి రూ.54.01 కోట్ల విలువైన ఆస్తులు (ఇందులో స్థిరాస్తుల విలువ రూ.27.28 కోట్లు) ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. తనపై 54 కేసులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘చేతిలో రూ.లక్ష నగదు, భార్య ఈటల జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. వ్యక్తిగత అడ్వాన్సుల కింద రూ.21.11 కోట్ల అప్పులు ఇచ్చాం. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయి’’ అని వెల్లడించారు.

రఘునందన్‌రావుకు రూ.21.07 కోట్ల ఆస్తులు

మెదక్‌ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. తనకు రూ.21.07 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో చరాస్తులు రూ.9.13 కోట్లు, స్థిరాస్తులు రూ.12.94 కోట్లుగా చూపించారు. రూ.12.11 కోట్ల రుణాలు ఉన్నట్లు ప్రకటించారు. తనపై 28 కేసులు ఉన్నాయన్నారు. చేతిలో రూ.2.5 లక్షల నగదు, బ్యాంకులో రూ.5.2 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత అడ్వాన్సుల కింద రూ.3.14 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 4 తులాల బంగారం, భార్య మంజులాదేవికి పదితులాల బంగారం, ఒక డైమెండ్‌ నెక్లస్‌ ఉన్నాయన్నారు. కుటుంబానికి 46.25 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

కారులేని పోతుగంటి భరత్‌ప్రసాద్‌

నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌ తన కుటుంబానికి రూ.33.85 లక్షల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో రూ.15.86 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి కేసుల్లేవని వెల్లడించారు. సొంతగా కారు లేదని, చేతిలో నగదు రూ.2 లక్షలు ఉన్నాయని, ద్విచక్ర వాహనం, 15 తులాల బంగారంతో కలిపి రూ.17.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కల్వకుర్తి మండలం గుండూరులో 7.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని