భాజపాను అడ్డుకుంటేనే రేవంత్‌కు, లౌకికవాదానికి మంచిది

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.

Published : 19 Apr 2024 04:39 IST

కేరళలో వామపక్షాలపై నోరు పారేసుకోవడం సరికాదు
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఎం ఎన్నికల ప్రణాళిక (తెలుగు అనువాదం)ను రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు ఎస్‌.వీరయ్య, జ్యోతిలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడారు. ‘‘గత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో గెలవకుండా భాజపాను సీపీఎం అడ్డుకుంది. ఈసారీ ఆ పార్టీ ఖాతా తెరవనీయం. తెలంగాణలో భాజపా ఒక్క స్థానంలోనూ గెలవకూడదన్నది మా లక్ష్యం. ఈ విషయంలో మాతో కాంగ్రెస్‌ కలిసిరావాలి. భాజపా గెలవకూడదంటే ఏం చేయాలో రేవంత్‌రెడ్డి ఆలోచించాలి. రాష్ట్రంలో ఆ పార్టీని అడ్డుకుంటేనే ఆయనకు, లౌకికవాదానికి మేలు కలుగుతుంది. సీపీఎం మ్యానిఫెస్టోలోని అణ్వాయుధాల అంశంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు’’ అని రాఘవులు పేర్కొన్నారు.

భువనగిరిలో పోటీ తథ్యం: తమ్మినేని

భువనగిరిలో సీపీఎం తప్పకుండా బరిలో ఉంటుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సీఎం, కాంగ్రెస్‌ నాయకులు వచ్చి సీపీఎం నేతలతో మాట్లాడతారని మధ్యవర్తులు చెప్పారని, కాంగ్రెస్‌ వైఖరిపై స్పష్టత వచ్చాక నిర్దిష్ట ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి రెండేసి చోట్ల పోటీ చేశామని, ఈసారీ అందుకు ప్రయత్నించినా సీపీఐ స్పందించలేదన్నారు. భువనగిరిలో సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ శుక్రవారం నామినేషన్‌ వేస్తారని ఎస్‌.వీరయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని