సంక్షిప్త వార్తలు (7)

ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది.

Updated : 19 Apr 2024 06:18 IST

మోదీ వచ్చాకే ఈశాన్యం మమేకం

ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. కాంగ్రెస్‌ రాజకీయ బుజ్జగింపులను మార్చిన మోదీ.. ఆచరణీయత, బాధ్యతలను ప్రవేశపెట్టారు. సానుకూల కార్యాచరణ, సానుకూల బాధ్యతాయుతమైన పాలనను ఆయన తీసుకొచ్చారు.

అస్సాంలోని సభల్లో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా


అమేఠీ నుంచి పోటీ చేసే ధైర్యం లేదు

అమేఠీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్‌కు లేదు. అందుకే కేరళకు వలస వచ్చారు. వయనాడ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ను మరోసారి తమ ఎంపీగా ఎన్నుకోవద్దని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు విన్నా. హస్తం పార్టీ తమ యువ నేత ‘రాహుల్‌యాన్‌’ను గత 20 ఏళ్లుగా లాంచ్‌ చేయలేకపోతోంది.

కేరళ ప్రచార సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


అమేఠీలో రాహుల్‌ పోటీ చేయాలి

అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయాలని ఆశిస్తున్నా. అక్కడి నుంచి ఆయన ఎందుకు పోటీ చేయలేకపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి దక్షిణాదిలో భాజపా మంచి ఫలితాలను సాధిస్తుంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా


రాహుల్‌ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌

రాహుల్‌ స్పూన్‌ ఫీడింగ్‌ కిడ్‌.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు. ఆయన భాజపా పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు సంకోచిస్తున్నారు. అంతేగాకుండా మైనారిటీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

కాంగ్రెస్‌ మాజీ నేత గులాంనబీ ఆజాద్‌


ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ప్రధాని

ప్రచారంలో ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉంటున్నాయి. రాముడు ఒక అంశంగా మత విభజనను ప్రోత్సహించే రీతిలో మోదీ చేసిన వ్యాఖ్యల జాబితాను ఎన్నికల సంఘానికి అందించా. వామపక్షాలను మాత్రమే విమర్శిస్తూ కాంగ్రెస్‌, యూడీఎఫ్‌లు భాజపాను వదిలేస్తున్నాయి.

కేరళ ప్రచార సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి


చిన్న సైకో పేర్ని కిట్టు: మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో పెద్ద సైకో జగన్‌ అయితే.. చిన్న సైకో మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు, మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చినట్టు చెబుతున్న నాని.. బందరు పోర్టు నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎంతో చెప్పాలని గురువారం ఓ ప్రకటనలో సవాల్‌ చేశారు.


తిరుపతి లోక్‌సభ ఎన్నికల సమన్వయకర్త నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుపతి లోక్‌సభ జనసేన సమన్వయకర్తగా తమ్మినేని వెంకటేశ్వర్లు, సహ సమన్వయకర్తగా హరిశంకర్‌రావును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నియమించారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను యెల్లటూరి శ్రీనివాసరాజుకు అప్పగించారు. కాకినాడ లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కమిటీలో నల్లా అజయ్‌, గౌతు లక్ష్మీకుమారిలను సభ్యులుగా గురువారం నియమించారు. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్తగా మేడిశెట్టి సూర్యకిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని