తేనీటి వెనక కన్నీటి ధారలు!

మన దేశంలో వేడివేడి ఛాయ్‌ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!!

Updated : 19 Apr 2024 06:17 IST

ఉత్తర బెంగాల్‌లో కష్టంగా సాగుతున్న తేయాకు ఉత్పత్తి
ఎన్నికల వేళ కూలీల ఓట్ల కోసం పార్టీల ఆరాటం

కోల్‌కతా: మన దేశంలో వేడివేడి ఛాయ్‌ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! అయితే తేనీటి తయారీలో అత్యంత కీలకమైన తేయాకు ఉత్పత్తిదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర బెంగాల్‌లో విస్తరించి ఉన్న పలు తేయాకు తోటలు నష్టాల కారణంగా మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ అక్కడి పరిస్థితులపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.

300కు పైగా తోటలు

ఉత్తర బెంగాల్‌లోని దార్జీలింగ్‌, దువార్‌, తెరాయ్‌ ప్రాంతాల్లో 300కుపైగా తేయాకు తోటలు విస్తరించి ఉన్నాయి. దార్జీలింగ్‌, అలీపుర్‌ద్వార్‌, జల్పాయ్‌గుడీ, కూచ్‌బిహార్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తోటల్లో సుమారు 4.5 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నట్లు అంచనా. ఎన్నికల్లో విజయానికి వారి ఓట్లు కీలకం. అందుకే ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా నేతలు వారిపై దృష్టిసారించారు. తేయాకు తోటల్లో పనిచేసేవారి దుస్థితికి, యజమానుల కష్టాలకు మీరంటే మీరే కారణమంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కూలీల ఓట్లు దక్కించుకునేందుకు ఘనమైన హామీలు ఇస్తున్నారు.

ఉత్పత్తి ధరలు పైపైకి..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం తేయాకు వార్షిక ఉత్పత్తి 13.5 కోట్ల కిలోల వరకూ ఉంది. కొన్నేళ్లుగా దాని ఉత్పత్తి ధరలు భారీగా పెరిగాయి. కానీ తేయాకుకు వేలంలో ఆశించిన ధరలు దక్కడం లేదు. దేశీయంగా వినియోగంలో పెరుగుదల పెద్దగా నమోదవడం లేదు. ఎగుమతి మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనవుతోంది. ఫలితంగా యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్తర బెంగాల్‌లో ఇటీవల 12 తోటలు మూతపడ్డాయి.

సాయం కోసం ఎదురుచూపులు

ఉత్తర బెంగాల్‌లోని తేయాకు తోటల్లో పనిచేసేవారికి ప్రస్తుతం కనీస వేతనంగా రోజుకు రూ.250 చెల్లిస్తున్నారు. ఆరోగ్యం, రేషన్‌, గృహవసతి, విద్య వంటి సదుపాయాలనూ వారికి కల్పించాల్సి ఉంటుంది. అయితే అవి వారికి ప్రస్తుతం చాలావరకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి! దాంతో కూలీలు వలస బాట పడుతున్నారు. తేయాకు అభివృద్ధి, ప్రోత్సాహక పథకం కింద తమకు అందించే ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని తోటల యజమానులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఉత్పత్తి ధరలో దాదాపు 60% వరకూ తాము కూలీలకే చెల్లించాల్సి వస్తోందని.. వారికి కూలిని మరింత పెంచాల్సి వస్తే తాము తోటలను మూసివేసే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తృణమూల్‌కు మొగ్గు?

తేయాకు పండించే ప్రాంతాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు పెద్దగా ఓట్లు పడలేదు. దాంతో మమతా బెనర్జీ సర్కారు అప్రమత్తమై.. అక్కడి కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. ‘ఛా సుందరి’ పథకం కింద ఇళ్ల నిర్మాణంలో చేయూత అందించింది. పలువురికి భూ పట్టాలు పంపిణీ చేసింది. ఫలితంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ మంచి ఫలితాలు దక్కాయి. మరోవైపు- కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తమకు అంతగా సహాయం చేసిందేమీ లేదన్న అభిప్రాయాలు స్థానిక కూలీలు, యజమానుల్లో వ్యక్తమవుతున్నాయి. పైగా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని టీ బోర్డు తమకు రాయితీలు ఇవ్వడాన్ని 8 ఏళ్ల కిందటే నిలిపివేసిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమరంలో ఇక్కడ తృణమూల్‌కే కాస్త మొగ్గు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని