వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..

భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ భార్గవ్‌ కాంగ్రెస్‌లో చేరిక అంశం వివాదాస్పదమైంది.

Updated : 28 Apr 2024 06:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ భార్గవ్‌ కాంగ్రెస్‌లో చేరిక అంశం వివాదాస్పదమైంది. భార్గవ్‌తో పాటు ఆయన భార్య, మిర్యాలగూడ మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నాగలక్ష్మి, 13 మంది కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే తమతో సంప్రదింపులు జరపకుండా పార్టీలో చేర్చుకోవడంపై నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆదేశాల మేరకు చేరికలను తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చేరికల తేదీని ప్రకటిస్తామని, అప్పటివరకు భార్గవ్‌ చేరిక నిలుపుదలలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భార్గవ్‌ కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేరికను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో పార్టీని వీడినవారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో భార్గవ్‌, పలువురు కౌన్సిలర్లు నేరుగా హైదరాబాద్‌కు వచ్చి దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. అయితే, తమను సంప్రదించకుండా చేర్చుకోవడంపై జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో.. చేరికలను నిలుపుదల చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు