ఈ ఏడాదే ‘మహిళలకు ఉచిత బస్సు’

Eenadu icon
By Politics News Desk Published : 12 Nov 2024 06:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా బడ్జెట్‌ కేటాయింపులు
గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 

ఈనాడు, అమరావతి: ఎన్డీయే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ హామీని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో ‘తల్లికి వందనం’ పథకానికి రూ.6,487 కోట్లు, ‘అన్నదాత సుఖీభవ’కు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా విధానాలు రూపొందించడంతో పాటు  బడ్జెట్‌లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్‌ వద్ద సోమవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ‘ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నాం. గత ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలరని ప్రజలు మాకు అఖండ మెజార్టీ కట్టబెట్టారు. ఈ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయి. గత పాలకులు పూర్తిగా అధికార, ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారు. వ్యవస్థల్ని నాశనం చేశారు. పాలన.. వ్యక్తి కోసమా, ప్రజల కోసమా అన్న సంశయాన్ని కలిగించారు. కేంద్రం నిధుల్ని దారి మళ్లించారు. స్వార్థం, లాభాపేక్షతో ఇసుక, మద్యం విధానాలు రూపొందించారు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.1.35 లక్షల కోట్లు బకాయి పెట్టారు. వీటన్నింటినీ సరిచేస్తూ బడ్జెట్‌ ప్రవేశపెట్టామ’ని వివరించారు.


వైద్య రంగానికి సముచిత ప్రాధాన్యం

వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి వైద్యారోగ్య శాఖకు 23 శాతం అదనంగా నిధులు కేటాయించారు. విద్యారంగం తర్వాత వైద్యానికే అధిక ప్రాధాన్యం లభించింది. ఇది కరెక్షన్‌ బడ్జెట్‌. గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లు దారి మళ్లించింది. వాళ్లు పెట్టిన రూ.1,300 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిల్ని మేం చెల్లించాం. మూలధన వ్యయంగా రూ.2,100 కోట్లు ప్రతిపాదించాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చులో సుమారు 55 శాతాన్ని ఈ ఒక్క ఏడాది బడ్జెట్‌లోనే కేటాయించాం. జగన్‌రెడ్డి తాను కట్టానని చెబుతున్న 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి సింహభాగం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు