తెదేపా రాష్ట్ర కార్యదర్శి కన్ను పొడిచేశారు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు.

Updated : 04 Sep 2022 09:19 IST

ఇనుపచువ్వతో పొడవటంతో కుడి కన్ను కోల్పోయిన చెన్నుపాటి గాంధీ

వైకాపా నాయకుల హత్యాయత్నం!

మా ప్రభుత్వ హయాంలో మీ పెత్తనమేంటని దౌర్జన్యం

నిన్ను చంపితే దిక్కెవరంటూ కర్రలు, రాళ్లతో దాడి

విజయవాడ (పటమట), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఆయనను వదిలేసి వెళ్లిపోయారు. ఇనుపచువ్వతో దాడి చేయడంతో గాంధీ కుడి కన్ను పూర్తిగా దెబ్బతిన్నఘటన శనివారం సాయంత్రం విజయవాడ 9వ డివిజన్‌లో చోటు చేసుకుంది. విజయవాడలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. హైదరాబాద్‌ ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు సూచించారు. దీంతో హైదరాబాద్‌కు తరలించారు.

తెదేపా తరఫున విజయవాడ నగర రాజకీయాల్లో గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన కార్పొరేటర్‌గా 4 సార్లు విజయం సాధించారు. విజయవాడ 9వ డివిజనుకు ప్రస్తుతం ఆయన భార్య కాంతిశ్రీ కార్పొరేటర్‌గా ఉన్నారు. పైపులైను లీకేజీపై ఫిర్యాదులు రావడంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కార్పొరేషన్‌ సిబ్బందితో గాంధీ పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నాయకులు అక్కడికి వచ్చారు. మా ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పెత్తనం ఏమిటంటూ.. వాగ్వాదానికి దిగారు. డివిజన్‌ వైకాపా అధ్యక్షుడు గద్దె కల్యాణ్‌, వల్లూరి ఈశ్వర ప్రసాద్‌, సుబ్బు, మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ‘నిన్ను చంపుతాం. మాకు ఎదురులేదు. మీకు దిక్కెవరు? మా ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నువ్వు చేయడం ఏమిటి’ అంటూ దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో కొట్టి, ముష్టిఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో దాడి చేయడంతో గాంధీ కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. స్థానికులు కొంతమంది అడ్డుపడటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడిన గాంధీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, పలువురు కార్పొరేటర్లు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలం రికార్డు చేశారు. పటమటలంక ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రణాళిక ప్రకారమే దాడి
పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఇంతకుముందు అందరూ కలిసి వేడుకలు జరిపేవారు. ఇటీవల పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈసారి వైకాపా నాయకులను పిలవకుండా ఉత్సవాలు చేస్తున్నామని మనసులో పెట్టుకుని గొడవ పడ్డారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.


ఫోన్లో చంద్రబాబు పరామర్శ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయవాడలో వైకాపా శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. ‘దాడి కారణంగా గాంధీ కంటిచూపు దెబ్బతిందని కుటుంబ సభ్యులు చెప్పడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మెరుగైన చికిత్స అందించాలని స్థానిక నేతలకు సూచించాను. గాంధీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి’ అని చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని