అమరావతినే కొనసాగించాలి

‘రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. విభజన హామీల మేరకు వెనుకబడిన రాయలసీమకు పరిశ్రమలతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి, అభివృద్ధి చేయాలి’ అని సీపీఎం

Published : 24 Sep 2022 05:52 IST

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ‘రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. విభజన హామీల మేరకు వెనుకబడిన రాయలసీమకు పరిశ్రమలతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి, అభివృద్ధి చేయాలి’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ డిమాండు చేశారు. ‘దేశ రక్షణ భేరి’ పేరిట శుక్రవారం పుట్టపర్తిలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ పాలన అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, పేదల భూములు లాక్కోవడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమేమీ సీఎం జగన్‌ చేయడం లేదని విమర్శించారు. ఆయనకు కేసుల భయం పట్టుకొని, కేంద్రం ఎదుట నోరుమెదపడం లేదని ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు, వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. వ్యవసాయ బోరుబావులకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ, సామాన్యులపై భారం మోపుతోందని ఈ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ భాజపా పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. సంపద కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉందని, కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. మోదీ, అమిత్‌షాలు విభజించు, పాలించు అనే బ్రిటిష్‌ సూత్రాన్ని పాటిస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని