Chandrababu - TDP: బాబూ.. మాకు మీరే కావాలి... ఊరూరా అదే మాట!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా ఘన విజయం దిశగా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఘనవిజయానికి కారణాలు చూద్దాం!

Updated : 04 Jun 2024 20:39 IST

తెలుగు రాష్ట్రాల విభజనతో.. కొత్త నడక ప్రారంభించిన రాష్ట్రం, బుడిబుడి అడుగులు వేస్తూ ప్రగతి పథాన నడుస్తున్న వేళ... ‘ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి.. పరుగులు తీయిస్తా’ అంటూ నమ్మబలికాడో యువ నాయకుడు. అవి డబుల్‌ కా  మీఠా మాటలు. ప్రజలు నమ్మారు. ఒక అవకాశం ఇచ్చారు. ఆ తరవాత తెలిసింది.. అవి మాయ మాటలని! ఊసరవెల్లి రంగులని! అప్పటికే ఆలస్యమైంది.. ఆ కబంధ హస్తాలు రాష్ట్రాన్ని కబళించడం మొదలెట్టాయి. కానీ అదెంత కాలం? నలుదిశలా కమ్ముకొన్న విధ్వంసాన్ని ఆపేందుకు ఓ వ్యక్తి అడ్డుపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు నేనున్నా’ అంటూ ఎదురొడ్డారు. అరెస్టు చేయించినా, నానా బాధలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఆయన పోరాట స్ఫూర్తికి.. ప్రజలు పట్టం కట్టారు. ఆ కపట మాటల నాయకుడు జగన్‌ అయితే.. ప్రజాహితం కోరే ఆ యోధుడు చంద్రబాబు నాయుడు. ఆ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడంలో చంద్రబాబుది కీలక పాత్ర.  

అదరగొట్టిన ‘ఆరు’ హామీలు 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబుకు, కూటమికి మళ్లీ పట్టం కట్టడంలో సూపర్‌ సిక్స్‌ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా రూ. 3000 నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేలు ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఏడాది ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి మహిళకు రూ. 15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అంటూ తెదేపా తీసుకొచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ సూపర్‌ హిట్‌ అయింది. ‘బాబు ష్యూరిటీ… భవిష్యత్తుకు గ్యారెంటీ’ అని మహిళలు, యువత, రైతులు.. పట్టం కట్టారు. 

రివర్స్‌ పాలనకు ‘రివర్స్‌’

గత ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితినీ.. ఈ ఎన్నికల నాటి స్థితినీ బేరీజు వేసుకుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని తెదేపా, భాజపా, జనసేన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి.  పోలవరాన్నే తీసుకుంటే… రాష్ట్రానికి మణిమకుటంగా నిలవాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తిగా గాలికొదిలేసింది వైకాపా ప్రభుత్వం. జగన్‌ ప్రభుత్వం అలసత్వం, చేతకానితనం వల్ల పోలవరం భద్రతకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల పరిస్థితీ ఇంతే. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టులను ‘రివర్‌’ పాలు చేశారు. దీనిని గ్రహించిన ఏపీ ప్రజలు ‘కట్టాలన్నా.. నిలబెట్టాలన్నా ఆయనే’ అంటూ తమ తీర్పుని కూటమికి అనుకూలంగా ఇచ్చారు. 

నా..నా మాటలు వినలేదు!

‘నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు,  నా మైనారిటీలు..’ అంటూ మాటలు చెప్పడం కన్నా.. చేతల్లో చూపించే నాయకుడిని గెలిపించడం బెటర్‌ అని ఏపీ ప్రజలు అనుకున్నారు. అందుకే ‘నా.. నా’ మాయ మాటలు చెప్పిన జగన్‌కు  కాకుండా అందరినీ తనవాళ్లు అనుకునే చంద్రబాబుకు ఓటేశారు. ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. పవన్‌ కల్యాణ్‌ కూటమిలో భాగం అయ్యాక ఆ వర్గం నాయకులకు  తగిన భాగస్వామ్యం లభిస్తుందన్న సంకేతాలు పంపారు. వాటిని ప్రజలు అర్థం చేసుకున్నారు. 

ప్రగతికి బాట.. 3 రాజధానులకు టాటా

చంద్రబాబు అంటే ఓ బ్రాండ్. హైదరాబాద్‌ నగరం, తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ పటంలో ప్రముఖంగా మారడంలో చంద్రబాబు కృషి ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి నవ్యాంధ్రగా మారాక.. ఆయన మరోసారి అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంపొందించే పని ప్రారంభించారు. ‘ఒక్క అవకాశం ఇవ్వండి..’ అంటూ 2019లో వచ్చిన జగన్‌ పెంచాల్సింది చేయకపోగా.. ‘మూడు రాజధానులు’ అంటూ తుంచేశారు. ఈ క్రమంలో మళ్లీ చంద్రబాబు రావాలి, ఏపీ ప్రగతి పథంలోకి వెళ్లాలి అని జనాలు గ్రహించి ఓటేశారు. మంచి రోజులకు బాటేశారు.  

భక్షక చట్టానికి వ్యతిరేకం 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌… ప్రజల మీద వైకాపా ప్రభుత్వం వదిలిన భయానక చట్టం. మీ భూమి మీ చేతుల్లో కాకుండా వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్న చట్టం అది. కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసింది. దీనిని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు అసలు విషయాన్ని ప్రజల ముందుంచారు. కూటమి ప్రచార సభల్లో వాస్తవాలను వివరించారు. దాంతో ‘బాబు వస్తే మా భూములు మావే అవుతాయి’ అంటూ గెలిపించారు ఏపీ ప్రజలు. 

పిలుపిస్తే ప్రభం‘జనమే’

‘మన రాష్ట్రాన్ని వైకాపా మూకల నుంచి కాపాడుకుందాం’ అంటూ చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన పిలుపు బాగా పని చేసింది. పక్క రాష్ట్రాలకు, విదేశాలకు ఉపాధి కోసం వెళ్లిన ఏపీ వాసులు ఎన్నికల సమయానికి సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో వైకాపా ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేసి బస్సులు లేకుండా చేసినా వెరవలేదు. ఈ ‘ఐదేళ్ల నరకం మళ్లీ మాకొద్దు’ అని చెప్పడానికి అంతలా జనాలు రావడం చూసినప్పుడే చంద్రబాబు విజయం ఖాయమని అర్థమైంది. అదే జరిగింది. 

మూడు ముక్కలాట వద్దు 

ప్రజా రాజధాని అమరావతి కోసం చంద్రబాబు పడ్డ కష్టాన్నీ, వేసిన ప్రణాళికలనూ జగన్‌ భస్మం చేశారు. దుండగులు కొందరు అమరావతి నమూనాలను విరగ్గొట్టి ఆనందించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధాని అంటే మూడు  ముక్కలాట కాదు.. అది మన రాష్ట్ర గౌరవం అని చంద్రబాబు ఎంత  చెప్పినా జగన్‌ వినలేదు. ప్రజలు మాత్రం గ్రహించారు. అమరావతి నిర్మాణం అవసరాన్ని గుర్తించి ఓటేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి తనది హామీ అని చంద్రబాబు చెప్పిన మాటల్ని ప్రజలు పూర్తిగా విశ్వసించారు. అందుకే వైకాపాను ఓటు వేయకుండా దండించారు.

జాబు రావాలంటే బాబు రావాలి 

ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం, దానికి కోసం సర్వశక్తులు ఒడ్డడం ఎలా అనేది దేశంలో చంద్రబాబుకు మించి ఎవరికీ తెలియదు అని అంటుంటారు. ఆయన అలా కష్టపడ్డారు కాబట్టే హైదరాబాద్‌ ఇంతలా అభివృద్ధి చెందింది. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితే చూడాలని చంద్రబాబు పరితపించారు. కొత్త కంపెనీల ఏర్పాటు కోసం ఎక్కే గడపా దిగే గడపలా ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆ ఆలోచనలు ఫలిస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. కొత్త కంపెనీలు రాకపోగా.. ఉన్నవి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ ప్రజలు బలంగా కోరుకున్నారు.  

చంద్రబాబుకు ఊపొస్తది.. 

చంద్రబాబు వయసు గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే.. ఈ ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం, ప్రజల కోసం పడిన ఆరాటం ఓసారి చూడాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. ఓ యంగ్‌ పొలిటీషియన్‌లా ప్రచారం చేశారు. ఇదంతా ఏపీ ప్రజలను జగన్‌ అసమర్థ పాలన నుంచి రక్షించడానికే అని జనాలు అర్థం చేసుకున్నారు. ‘వయసు పెరుగుతుంటే ఎవరికైనా అలుపొస్తది.. మా చంద్రబాబుకి మాత్రం ఊపొస్తది’ అంటూ అభిమానులు ప్రేమగా అనుకుంటుంటారు. 

వైకాపా కుయుక్తులకు అడ్డుకట్ట

వంతపాట పాడటమే విధిగా ఉద్యోగ నిర్వహణ చేస్తున్న వైకాపా సానుభూతి పరులైన అధికారులను అడ్డుకుని చంద్రబాబు ఎలా ముందుకెళ్తారు,  నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి అని తెదేపా నేతలు, సగటు ఓటర్లలో చిన్న భయం ఉండేది. అయితే ఆయన బృందం నిరంతరాయంగా ఇక్కడి అధికారుల గురించి ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో చాలామంది జగన్‌ సానుభూతిపరులను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచగలిగారు. ఆయన అలా చేయకపోయుంటే ఎన్నికల నిర్వహణ మరింత కష్టంగా మారేదే. మనం గెలవాలని ట్రై చేయడమే కాదు.. ఎదుటి వాళ్ల కుయుక్తులను అడ్డుకోవడమూ ఎంత ముఖ్యమో చంద్రబాబు ఈసారి చేసి చూపించారు.  

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని