Rahul Gandhi: నా ప్రశ్నలకు ప్రధాని నుంచి సమాధానం రాలేదు: రాహుల్‌

లోక్‌సభలో ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం తనకు సంతృప్తినివ్వలేదన్నారు రాహుల్‌ గాంధీ. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదన్నారు. 

Published : 08 Feb 2023 20:17 IST

దిల్లీ: లోక్‌సభ(Lok sabha)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేసిన ప్రసంగం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. అదానీ గ్రూప్‌(Adani group) వ్యవహారంపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు చెప్పలేదన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన బడ్జెట్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపిన తీర్మానంపై లోక్‌సభలో చర్చ అనంతరం ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం ప్రసంగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలను లక్ష్యంగా చేసుకొని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే, మోదీ ప్రసంగం అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. మోదీ ప్రసంగంలో తనకు సమాధానం కనిపించలేదన్నారు.

అదానీ వ్యవహారంలో తాను సభలో అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని రాహుల్‌ అన్నారు. అంతేకాకుండా అదానీ గ్రూప్‌ వ్యవహారంలో దర్యాప్తు చేస్తామని కూడా అనలేదని మండిపడ్డారు. అదానీని ప్రధాని నరేంద్ర మోదీనే రక్షిస్తున్నారని ఆరోపించారు. స్నేహితుడు కాకపోతే దర్యాప్తు జరపాలి కదా.. మరి ఎందుకు దర్యాప్తుపై మాట్లాడటంలేదని ప్రశ్నించిన రాహుల్‌.. అదానీని మోదీయే రక్షిస్తున్నారని దీంతోనే తేలిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించింది గనక ప్రధాని విచారణ జరిపించాల్సిందే’’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని