Jairam Ramesh: ఇది అందాల పోటీ కాదు: ‘ప్రధాని అభ్యర్థి’పై జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు

Jairam Ramesh: ఎన్నికలంటే అందాల పోటీ కాదని, అందుకే మోదీపై ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Updated : 22 May 2024 18:00 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) విపక్ష ‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థే లేరంటూ భాజపా నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అధికారంలోకి వస్తే ఏడాదికి ఒకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకుంటారంటూ ప్రధాని మోదీ (PM Narendra Modi) కూడా దుయ్యబట్టారు. ఈ విమర్శలపై తాజాగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Congress Leader Jairam Ramesh) స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదేం అందాల పోటీ కాదంటూ కౌంటర్‌ ఇచ్చారు.

‘‘ఎన్నికలంటే వ్యక్తుల మధ్య జరిగే అందాల పోటీ కాదు. అందుకే నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ప్రధాని (Prime Minister) అభ్యర్థిని ప్రకటించలేదు’’ అని అన్నారు. అంతేగాక, తాము అధికారంలోకి వస్తే కేవలం కొన్ని గంటల్లోనే ప్రధాని పేరును ఖరారు చేస్తామని వెల్లడించారు.

సొంత కూటమి అభ్యర్థిపైనే పోటీ.. ఆ నటుడిపై భాజపా వేటు

కూటమి ఫార్ములా ఇదే..

ఈసందర్భంగా కూటమి (INDIA Bloc)లో ప్రధాని అభ్యర్థి ఎంపిక ఎలా ఉండనుందనే దానిపై తమ ఫార్ములాను జైరాం రమేశ్‌ బయటపెట్టారు. ‘‘2004 ఎన్నికల తర్వాత ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ పేరును నాలుగు రోజుల్లో ఖరారు చేశాం. ఈసారి రెండు రోజులు కూడా పట్టదు. గెలిచిన ఎంపీలంతా సమావేశమైన కొన్ని గంటల్లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారు. నాడు ప్రధానిని ఎలా ఎంపిక చేశామో, అదే ఫార్ములాను ఇప్పుడూ అమలుచేస్తాం. కూటమిలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి చెందిన వ్యక్తే ప్రధాని అవుతారు’’ అని కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు.

విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిపై మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే కూడా ఖండించిన సంగతి తెలిసిందే. ‘‘యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో మాకు మిత్రపక్షాలు పూర్తి మద్దతు ఇచ్చాయి. పదేళ్ల పాటు ఒకే వ్యక్తి (మన్మోహన్‌ సింగ్‌) ప్రధానిగా కొనసాగారు’’ అని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని